ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన చర్చిస్తున్న అంశం "రాజధాని తరలింపు - మూడు రాజధానులు" , అసలు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి, వేర్వేరు రాజధానులు అని తీర్మానించుకున్నాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా 5 ఏళ్ళ తరువాత ఈ రాజధాని గొడవ ఎందుకు తెరమీదకి వచ్చింది? ఇది ప్రజల సౌకర్యం కోసమా లేక పాలకుల వ్యాపారం కోసమా? లేక ఆంధ్ర రాష్ట్రము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల నుండి ప్రజల ద్రుష్టి మరల్చే ప్రయత్నమా? అసలు ఏది రాజధాని - ఎవరి రాజధాని అనేది ఒకసారి చర్చించుకుందాం.
2014 ముందు వరకు జరిగిన విషయాలు అందరికి తెలిసినవే, వాటి గురించి మళ్ళీ ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. 2014 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైద్రాబాద్ మహానగరాన్ని పది సంవత్సరాల పాటు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉపయోగించుకోవడానికి సర్వ హక్కులు ఇచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఎన్నికల సందర్భంగా నాటి ఆంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్ కేసులో అడ్డంగా దొరికిపోవడంతో, తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు, ఉన్నపళంగా రాజధానిపై హక్కులను వదిలేసుకొని ఆంధ్రరాష్ట్రానికి పారిపోయి వచ్చారు.
ఆ తరువాత ప్రపంచస్థాయి రాజధాని, సింగపూర్, లండన్ , ఇస్తాంబుల్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి రైతుల నుండి దాదాపు 33 వేలఎకరాల మూడు పంటలు పండే భూమిని "ప్రజా రాజధాని అమరావతి" కోసం ప్రభుత్వం సేకరించింది. ఆ తరువాత నిర్మాణం సంగతి పక్కన పెట్టి వేలాది కోట్ల ప్రజాధనాన్ని 3D బొమ్మలు చూపిస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ నామమాత్రపు నిర్మాణాలు, తాత్కాలిక భవనాల నిర్మాణం చేశారు. ఇంత జరుగుతుంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులూ ఎవరూ కూడా జరుగుతున్నా తప్పులను అడ్డుకునే ప్రయత్నం చేయకుండా, అమరావతి నిర్మాణానికి సంపూర్ణ మద్దతు తెలియజేసారు. రాజధాని నిర్మాణం వెనుక లోటు పాట్లు ఎవరు కూడా చర్చించలేదు సరి కదా ఈ రాజధాని ముసుగులో సరికొత్త భూ దందాను ఇరుపార్టీల నాయకులూ నడిపారు.
ఇంతలో రాష్ట్రంలో ఎన్నికలు రావడం టీడీపీ ఘోర పరాజయం పొందటం, వైసీపీ తిరుగులేని విజయాన్ని సాధించడం జరిగింది.
నూతన ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లు:
అస్తవ్యస్తంగా ఉన్న రాజధాని నిర్మాణాన్ని క్రమపద్ధతిలో నిర్మించడం.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం.
అభివృద్ధిని ఒక్క రాజధాని ప్రాంతానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరణ జరిపించడం.
మరి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి?
ఒక్క రాజధాని నిర్మాణానికే దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని 3 రాజధానులు అంటూ రాష్ట్ర భవిష్యత్తుని అగమ్యగోచర స్థితికి తీసుకెళ్లాడు. ఈ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం అప్పటివరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతామని వచ్చిన ఎన్నో బహుళజాతి కంపెనీలు ఇంతటి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకునే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టలేమంటూ వెనక్కి వెళ్లిపోయాయి. రాజధాని నిర్మాణం జరిగితే తమ బిడ్డలా భవిష్యత్తు బాగుపడుతుందని ఉన్న కొద్దిపాటి భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన రైతులు రోడ్లపాలయ్యారు. యువతకు తమ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అసలు ఈ మూడు రాజధానుల నిర్మాణం ఎందుకు? అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు భాగాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చింది, అవి
లెజిస్లేటివ్ క్యాపిటల్
అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్
జ్యుడీషియరీ క్యాపిటల్
అసలు ఈ మూడు రాజధానుల గురించి కూలంకషంగా చర్చిస్తే వీటివల్ల కలిగే మేలు కంటే కీడే ఎక్కువ అనేది మేధావుల మాట. అదెలాగో చూద్దాం.
లెజిస్లేటివ్ క్యాపిటల్: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతుంది, తమ జీవితాలు బాగుంటాయి, అన్ని ప్రాంతాల ప్రజలకు అనుసంధానానికి అనువుగా ఉంటుంది అని రైతులు దాదాపు ౩౩ వేల ఎకరాల సారవంతమైన భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రజలు ఒక రాజకీయ పార్టీకి కాకుండా ప్రభుత్వానికి రాసిచ్చారు. మరి ఉన్నపళంగా ఇక్కడ కేవలం శాసన సభ మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండదు అని అంటే మరి ౩౩ వేల ఎకరాల భూమిని గత ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు వైసీపీ నేతలు ఎందుకు వ్యతిరేకించలేదు? అసలు శాసన సభ నిర్మించడం వాళ్ళ అది రాజధాని అయిపోతుందా? అక్కడేమైనా లక్షలాది ఉద్యోగాల కల్పనా జరుగుతుందా? నాయకులూ కాలక్షేపానికి ఉపయోగించుకునే విడిది ఇల్లు కోసం ౩౩ వేల ఎకరాలు భూమి, లక్షలాది మంది రైతుల ఆశలు, 5 కోట్ల మంది ప్రజల జీవితాలను పణంగా పెడతారా? ఈ రాజధాని వాళ్ళ ఎవరికీ పైసా ఉపయోగం లేదు అనేది మేధావుల మాట.
అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్: స్వతహాగా పారిశ్రామికంగా, పర్యాటకంగా, విద్యారంగం, చిత్ర పరిశ్రమ, రక్షణ శాఖలతో దశాబ్దాలుగా ఎంతో ఆర్థిక ప్రగతిని సాధించి ఇప్పటికే ఆర్థిక రాజధానిగా పేరుపొందింది. అయితే ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులపై కన్ను పడ్డ వైసీపీ నేతలు గతంలో ఇక్కడ రాజధాని వస్తుందేమో అనే యోచనతో విచ్చల విడిగా భూములు దోచుకున్నారు, అయితే రాజధాని అమరావతికి వెళ్లడంతో ఎలా అయినా సరే ఇక్కడ మళ్ళీ భూదందా మొదలు పెట్టాలనే సంకల్పంతో ఇక్కడకు "పరిపాలనా రాజధాని" తీసుకొస్తున్నాం అని ప్రచారం చేసి ఉన్నపళంగా ఇక్కడ భూముల ధరలు, అద్దెలు ఆకాశాన్ని చేరుకునేలా చేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. అసలు పాలన రాజధాని వల్లా ప్రత్యేకంగా విశాఖకు ఒరిగేది ఏమి లేదు అనేది ప్రజలు చెబుతున్న మాట.
ప్రశాంతంగా ఉండే విశాఖకు పాలన రాజధాని రావడం వల్ల, ఒక సచివాలయం భవనం, మంత్రుల నివాస సముదాయాలు తప్ప ప్రత్యేక అభివృద్ధి కానీ, నూతన పరిశ్రమలు కానీ రావు, అటువంటప్పుడు ఈ రాజధాని వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం, అదీ కాకుండా మంత్రులంతా ఇక్కడ కాన్వాయ్ లో తిరుగుతూ ప్రజలకు అనవసరమైన ట్రాఫిక్ కష్టాలు, ధరల పెరుగుదల, రియల్ ఎస్టేట్ దండాలు, రౌడీ రాజకీయాలు పెరుగుతాయని సగటు వైజాగ్ వాసి భయబ్రాంతులకు లోనవుతున్నారు.
జ్యుడీషియరీ క్యాపిటల్: హై కోర్ట్ ఏర్పాటు చేయడాన్ని రాజధాని అని ఏ విధంగా అంటారో, దీని వల్ల ప్రత్యేకంగా కర్నూల్ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరుగుతుందో ఆ జగన్ రెడ్డి కే తెలియాలి. హై కోర్ట్ ఏర్పాటు అనేది దశాబ్దాలుగా కర్నూల్ ప్రజల ఆకాంక్ష. అయితే హై కోర్ట్ పెట్టుకోవడంలో తప్పు లేదు కానీ దాన్ని ఏ విధంగా రాజధానిగా పరిగణిస్తారు అంటే సమాధానం లేదు. ఎక్కడెక్కడి నేరస్థులు, పోలీసుల రాక తప్ప ఏ పరిశ్రమ కానీ, సంస్థలు కానీ వస్తాయని చెప్పే ధైర్యం ఎవ్వరు చేయలేదు. మరి ఈ జ్యుడీషియరీ క్యాపిటల్ వల్ల సీమ కరువు తీరుతుందా? సీమ వెనుకబాటుతనం తీరుతుందా? మరి ఏ ఉద్దేశంతో దీనిని రాజధాని అంటారు?
ఇలా ఏ విధంగా చూసినా మూడు రాజధానుల వల్ల ప్రజలకు కానీ ఆయా ప్రాంతాలకు కానీ ఒరిగేది ఏమి లేదు, కేవలం మళ్ళీ బాగుపడేది రాజకీయ నేతలు, వారి బంధువులు మాత్రమే.
రాజధాని అంశంపై రాజకీయ పార్టీల మాటలు ఏంటి?
తెలుగుదేశం: నాడు అవసరం లేకపోయినా ౩౩ వేల ఎకరాల భూసేకరణ చేసి భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా సరే నిర్ణయం మారకుండా, రైతులకు భరోసా కల్పించే పనులు చేయలేదు. వీరు చేసిన దోపిడీల వలన, ఒక వర్గానికి భూములను దోచిపెట్టడం, ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది రాజధాని తరలింపుకు ప్రధమ కారణంగా అందరూ చెబుతున్నారు. రాజధాని పై ఆంధ్రులను మోసం చేసిన వారిలో ముందు వరసలో వీరు ఉంటారు.
వైసీపీ:నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు, ౩౩ వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పారు. అధికార , ప్రతిపక్షాలు ఇద్దరు ఏకాభిప్రాయానికి రావడంతో ప్రజలు కూడా భవిష్యత్తుపై భరోసాతో రైతులు త్యాగం చేసారు. ఆనాడు వైసీపీ నాయకులూ అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ ఊసెత్తలేదు. ఈరోజు ఉన్నపళంగా వైసీపీ నిర్ణయం మార్చడం వల్ల లక్షలాది రైతులు, ప్రజలు రోడ్డున పడ్డారు. ఇది జగన్ రెడ్డి చేసిన చారిత్రాత్మక తప్పిదంగా భావించవచ్చు.
జనసేన: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుంచి రాజధానిపై రైతులతో, అప్పటి ప్రభుత్వంతో సలహాలు, సంప్రదింపులు జరుపుతూ జరుగుతున్నా తప్పులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అన్ని వేల ఎకరాలు అవసరం లేదని మాట్లాడిన ఏకైక వ్యక్తి, కానీ ఆరోజు వైసీపీ కనీసం నోరెత్తలేదు. అలాగే భవిష్యత్తులో అధికారంలో ఎవరున్నా సరే ఇక్కడి రైతులకు అన్యాయం జరగకూడదు అని ప్రభుత్వం నుంచి బాకీ పత్రం కూడా ఇవ్వాలని చెప్తే నాటి టీడీపీ ప్రభుత్వం స్పందించలేదు. అలాగే ఈరోజు కూడా అయన పాలన ఒకచోట, అభివృద్ధి అన్ని చోట్లా అని ఒకే నిర్ణయంపై నిలబడ్డారు.
జరుగుతున్నా పరిణామాలు చూస్తే ఇది కేవలం అధికార వికేంద్రీకరణ తప్ప ఎటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ కూడా జరగటం లేదు అనేది అన్ని ప్రాంతాల ప్రజలు గమనించాల్సిన విషయం. ఇలా మూడు రాజధానులు అంటూ ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించడం మినహా జగన్ ప్రభుత్వం చేసిందేమి లేదు. ఇకమీద అయినా జగన్ మరోసారి తన తుగ్లక్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకొని ప్రజాభీష్టం మేరకు పాలనా చేస్తే నలుగురితో మంచి అనిపించుకుంటాడు, లేదంటే 151+2+1 మంది కలియుగ కౌరవులతో ఉన్న కురు సభ త్వరలోనే కూలిపోతుందని విశ్లేషకుల మాట.
コメント