top of page
Writer's picture Tyler Durden

ప్రజలగోడు పట్టించుకోని శాసనసభ సమావేశాలు

______ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని.. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన _______________అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.


ఇది చట్ట సభలకి ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు భాద్యతలు తీసుకోబోయే ముందు చేసే ప్రమాణం.కానీ నేడు మన ప్రజా ప్రతినిధుల తీరు,వ్యవహారం చూస్తుంటే ఈ ప్రమాణం నామమాత్రమే అని తేటతెల్లం అవుతుంది. ఇందుకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రత్యక్ష ఉదాహరణ.


ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకొబడిన ప్రజా ప్రతినిధులు ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమావేశమై ప్రజలకి సుపరిపాలన అందించేందుకు చర్చలు చేపట్టి చట్టాలు తీసుకురావడానికి శాసన సభ ఉన్నది.కానీ మన ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది.


నూతన ప్రభుత్వం ఏర్పడి సుమారు ఆరు నెలలు ముగిశాక,అంటే రాజకీయ వ్యవహార భాషలో హనీమూన్ పీరియడ్ అయిపోయాక జరుగుతున్న సమావేశాలు ఈ శీతా కాల సమావేశాలు. వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఇసుక విధానం వల్ల ఉపాధి కోల్పోయి కొన్ని లక్షల మంది రోడ్డున పడ్డారు,సుమారు ముప్పై మందికి పైగా భావన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకి పాలపడ్డారు, కేవలం ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల,నిర్లక్ష్యం వల్ల.ఇంతటి ఘొరం జరిగినా కూడా శాసన సభలో ఒక్కసారి కూడా ఈ సమస్య ప్రస్తావన కానీ,మృతులకి నివాళి కానీ, భాదిత కుటుంబాలని ఆదుకుంటాం అనే ప్రకటన కానీ వెలువడలేదు.గెలిపించిన ప్రజలపై నాయకులకి ఉన్న చిత్త శుద్ది ఇదీ.


కండిషన్లో లేని బోటుతో సరైన అనుమతులు లేకుండా ప్రయాణీకులను ఎక్కించుకొని విహారానికి వచ్చిన వారికి విషాదాన్ని మిగిల్చి ముప్పై కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది గోదావరి బోటు ప్రమాదం,సుమారు నెల రోజుల తరువాత బోటుని వెలికి తీశారు.దీనికి కనీస భాద్యత కూడా వహించలేదు ప్రభుత్వం.ఏ తప్పూ చేయాన్ని అమాయకుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా ఆ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు వీరు గుర్తు రాలేదు.భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాల నివారణకి చర్యలు చేపట్టడం దేవుడెరుగు కనీసం ఒక సంతాప తీర్మానం కూడా ప్రవేశ పెట్టలేదూ.


ఈ శీతా కాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకి వచ్చి ఆమోదింపబడి చట్టాలు అయ్యాయి.అయితే ఈ సమావేశాల్లో ఎక్కడ ఫలప్రదమైన చర్చ జరిగిన దాఖలాలు లేవు.ఏ బిల్లు చర్చ జరిగినా మా నాయకుడు శూరుడూ,వీరుడూ అంటూ పొగడ్తలూ,భజన కార్యక్రమాలు, ప్రతిపక్షం తరఫున నాలుగు విమర్శలు,వాటికి ప్రతి విమర్శలు,కాసేపు హంగామా, తప్ప బిల్లులో ఉన్న విధివిధానాల గురించి కానీ,వాటికి చేయాల్సియన సవరణల గురించి కానీ,అది చట్టమైతే దాని అమలుకొరకు చేపట్టాల్సిన పకడ్బందీ చర్యల గురించి కానీ,నిర్మాణాత్మక సలహాలూ సూచనలూ కానీ ఏవీ లేకుండా సాగిపోయాయి.




ఇక ఈ సమావేశాల్లో సభ్యుల అవగాహనా రాహిత్యం, భాద్యతా రాహిత్యం సుస్పష్టంగా బయటపడ్డాయి,ముఖ్యమంత్రితో సహా..ఒక అంశంపై చర్చ చేపడుతున్నపుడు ఆ అంశం గురించి కనీస అవగాహన అనివార్యం,కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారి నుండి మంత్రులు ఎమ్యెల్యేల వరకూ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ తమ అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శించారు.


ఇక సభా నియమాలకి సభ్యులంతా సామూహికంగా తిలోదకాలు ఇచ్చినట్లే అనిపిస్తుంది ఈ సమావేశాలు చూస్తుంటే.సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడం సభ నియమాలకి విరుద్దం.కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల నుండి ఆయన్ని ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నించే ఎమ్యెల్యేల దాకా అందరూ సభలో లేని వ్యక్తి గురించి పదే పదే ప్రస్తావించడం, అదీ వారి వ్యక్తిగత జీవితం గురించి పవిత్రమైన శాసన సభ సాక్షిగా, గౌరవప్రదమైన పదవిలో ఉంటూ అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం విచారకరం. ఉన్నత పదవిలో ఉన్నవారు వీటిని ఖండించాల్సింది పోయి ఆస్వాదిస్తూ చిరునవ్వులోలికిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిగత దాడిని నియంత్రించాల్సిన భాద్యత తీసుకోవాల్సిన గౌరవ వ్యవస్థ తనేకేమీ పట్టనట్లు ఉండిపోవడం విలువల పతనానికి నిదర్శనం.



కేవలం ఆత్మ స్తుతి – పర నిందా అన్నట్లుగా అధికార ప్రతి పక్షాలు ప్రతీ చర్చలో వాదులాడుకుంటూ పరస్పర దూషణలకి దిగుతూ అనవసర రాద్ధాంతాలు చేస్తూ విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారు,చేశారు కూడా.


ఈ శీతా కాల సమావేశాల్లో తెలుగు మాధ్యమ రద్దు,దిశ చట్టం వంటి కీలకమైన బిల్లులు చర్చలోకి వచ్చి చట్టాలుగా అమలులోకి వచ్చాయి.దిశ చట్టం గురించి చర్చలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి సభ సాక్షిగా సెల్యూట్ కొట్టి అభినందించిన ముఖ్యమంత్రి వర్యులకి సొంత రాష్ట్రంలో రెండేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న సుగాలీ ప్రీతి గుర్తు రాకపోవడం విచారకరం.దేశమంతా దిశ చట్టాన్ని అభినదిస్తున్నారు అని గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులకి సొంత రాష్ట్రంలో సుగాలీ ప్రీతికి న్యాయం చేయాలని మాత్రం గుర్తు ఉండడం లేదు.


ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ నిర్వహణకి ఒక నిమిషానికి సుమారు పదివేల రూపాయిలకి పైగా ఖర్చు అవుతుంది అని రెండేళ్ల క్రితం లెక్కలు చెబుతున్నాయి,నేటికి ఆ ఖర్చు ఇంచుమించూ అంతే ఉండొచ్చు లేదా ఇంకా పెరిగి ఉండొచ్చు.ఇంత ప్రజా ధనం భజన కార్యక్రమాలకీ,భూతు వ్యాఖ్యానాలాకీ,అమ్మా ఆలీ తిట్టుకోడానికీ,నీ అమ్మా మొగుడు అంటూ మంత్రి పదవిలో ఉన్నవాళ్ళు అరుచుకోడానికి,సినిమా డైలాగులతో తమ అధినాయకత్వం మెప్పు పొందడానికి వెచ్చిస్తున్నారు.


ఇదీ క్లుప్తంగా శీతాకాల సమావేశాలు జరిగిన తీరు.కనీసం రాబోయే బడ్జెట్ సమావేశాలు అయినా ప్రజా సమస్యల పై చర్చ జరుగుతుందేమో అని ఎదురు చూద్దాం.

121 views0 comments

Recent Posts

See All

Comments


bottom of page