top of page
Writer's pictureSainika Swaram

సమస్యల నిలయం శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా ఇది పోరాటాలకు పురిటిగడ్డ.

అందమైన కొబ్బరితోటలకి ఉద్ధానం.పచ్చని పొలాలకు నిలయం. ప్రాంతం. మా కొద్దీ తెల్ల దొరతనం అని నినదించిన గరిమెళ్ళ సత్యనారాయణ, గిడుగు రామ్మూర్తి (Telugu Linguist),బ్రిటిష్ వాళ్లపై తిరగబడ్డ సర్దార్ గౌతు లచ్చన్న పుట్టిన నేల. ఇండియన్ హెర్క్యూలస్ గా పేరుగాంచిన కోడి రామ్మూర్తి, ఒలింపిక్ క్రీడల్లో పథకం సాధించిన కరణం మల్లీశ్వరి ఈ జిల్లాలొనే పుట్టింది.. భరతమాత కి గుడి ఉన్న ఏకైక ప్రాంతం. పుణ్యక్షేత్రాలకి ప్రసిద్ధి చెందిన జిల్లా. రాష్ట్రంలో అత్యధిక తీరప్రాంతం కలిగిన జిల్లా. ఇన్ని ప్రత్యేకతలు వున్నా జిల్లాలో సమస్యలు మాత్రం అడుగడుగునా దర్శనమిస్తాయి..మానవ వనరులు,సహజ వనరులు అధికంగా ఉన్నా నాయకులు నిర్లక్ష్యం చేశారు.


శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలు.


ఇచ్చాపురం

ఈ ప్రాంతంలో తొలగించిన చెత్త ను పారవేసి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో, రహదారి పొడుగునా దుర్గంధం వెదజల్లే చెత్త ఈ ప్రాంతవాసుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. జీడీ రైతులతోబాటు, మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంత వాసులు కొబ్బరినుండి స్థిరమైన ఆదాయం పొందేవిధంగా ధరలు స్థిరీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మత్స్యకారులు సముద్రతీరంలో జెట్టి మరియు శీతల గిడ్డంగి నిర్మిస్తే ఆదాయం పెరుగుతుందని ఎదురుచూస్తున్నారు.

ఈ ప్రాంతంలో భారీ పరిశ్రమలేవి లేకపోవడంతో అధిక శాతం (80% కి పైగా) యువత గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లిపోతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది అనేక కష్టాలకు, మోసాలకు గురౌతున్నారు. ఉద్దానం అంటేనే కొబ్బరి తోటలు, ఉన్న వీటికి అనుబంధ పరిశ్రమలు లేవు. కిడ్నీ వ్యాధులకు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఒక్క ఇచ్ఛాపురం లోనే 7వేల మంది రోగులు డయాలిసిస్ చేయించుకునే దశలో ఉన్నారు. ఇక్కడ వారికి సరిపడా డయాలసిస్ సెంటర్ లు లేవు. బహుదా, మహేంద్రతనయ నదులపై పై వంతెనలు నిర్మించి, సాగు, తాగునీటి కష్టాలను రూపుమాపాలని ప్రజలు కోరుతున్నారు.


పలాస

మండలం మొత్తం మీద చూస్తే ఉఫాధి ప్రధాన సమస్య. జీడీ పరిశ్రమ తప్ప ఉఫాధి అందించే మార్గాలు తక్కువ. తితిలీ తూఫాన్ దాటికి నష్టపోయిన జీడిచెట్లు మళ్ళీ ఉత్త్పత్తి చెయ్యాలంటే మరో 10 సంవత్సరాలు పడుతుంది. సరైన జీవనాధారం లేకపోతె పట్టణాలన్నీ వలసలతో ఎడారులుగా మారిపోతాయి. ప్రాధమిక వసతులైన తాగునీరు, వైద్యం, ప్రాథమిక వసతులు లేవు. జీడీ పరిశ్రమలో పనిచేసే.వీరు అధికంగా చర్మ, ఊపిరితిత్తుల రోగాలబారిన పడుతున్నారు. వీరి జీవితాలకు కనీస భద్రతా, వైద్య సదుపాయాలూ లేవు. మండలంలో పారిశుద్ధ్యం, రహదారులు ప్రధాన సమస్యలు.

రైతులు సాగునీటి లేమి, నకిలీ విత్తనాల వలన ఇబ్బందులు పడుతుంటే, మత్స్యకారుల గ్రామాలు ఏ సదుపాయాలు లేక అయోమయావస్థలో ఉన్నాయి


టెక్కలి


అసెంబ్లీ పరిధిలో ఉన్న తేలినీలపురం ఇక్కడ సైబీరియా పక్షులకు నిలయం. ఇవి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది కానీ ఇక్కడ నుండి వచ్చే కాలుష్యం వల్ల వాటి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. భావనపాడు హార్బర్ నిర్మాణం దశాబ్దాలుగా పూర్తి కాలేదు. పోర్టుల వలన కాలుష్యానికి మత్స్య సంపద కూడా అంతరిస్తున్నది. కాలుష్యం ఆహార భద్రతకు పెనుముప్పు కలిగించకముందే తగిన చర్యలు అవసరం. టెక్కలి మండలంలో ప్రధాన సమస్యలు సాగు, తాగు నీరు , నిరుద్యోగం.


నరసన్నపేట


రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటె, తాగునీరు, సాగునీరు పూర్తిగా కొరవడ్డాయి. వంశధార రెండవ దశ పూర్తయితే వరి, చెరకు పంటలకు నీరు అందించవచ్చు. సాగు అంతంత మాత్రమే ఉన్న ఈ నియోజకవర్గ పరిదిలో పరిశ్రమలేవి లేకపోవడంతో ఉఫాధి అవకాశాలు లేక ప్రజలు వలసబాట పడుతున్నారు.


నరసన్నపేట పారిశుద్ధ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధభూయిష్టమైన పరిసరాలు దర్శనమిస్తాయి. నదులు, సముద్ర తీరం పుష్కలంగా ఉన్న ఈ మండలంలో ఇసుక అక్రమ రవాణ పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తున్నది. ప్రకృతి విపత్తులతో నిత్యం పోరాడే శ్రీకాకుళం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వే ఇసుక మాఫియా వేలకోట్లు సంపాదిస్తుంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుతుంది.


పాతపట్నం


నాగావళి, వంశధారా నదులు ఇక్కడే ప్రవహిస్తున్నా, ఈ ప్రాంతపు రైతులకు ఒక చుక్క సాగునీరు కూడా రాదు. కారణం జూన్ నెలలో పూర్తి కావలసిన వంశధారా రెండొదశ పనులు ఆలస్యమౌతున్నది. దీనికొరకు భూములిఛ్చిన రైతులకు, నిర్వాసితులకు మంజూరైన పరిహారం, మధ్యవర్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మకై తినగా, మిగిలినది మాత్రం వీరికి చేరింది. ఫలితంగా, జీవనోపాధిని పోగొట్టుకున్న రైతులు వలసపోతున్నారు. గిరిజన గ్రామాలలో తాగునీరు ప్రధాన సమస్య. వర్షాకాలంలో కొండలపైన కురిసే నీటికోసం, వేసవిలో నీళ్లు నిలువనున్న చెలమలకోసం కిలోమీటర్ల దూరం మహిళలు, పిల్లలు కాలినడకనే వెళ్ళవలసి వస్తుంది. వంశధారా నదికి సరైన కరకట్ట లేకపోవడంతో, ఒరిస్సా రాష్ట్రం లేదా శ్రీకాకుళం జిల్లా వర్షాలకు నదులు ఉప్పొంగి, గ్రామాల్లో ఇండ్లను ముంచేస్తాయి. నదీపరివాహక ప్రాంతం పొడవునా కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు.


రాజాం

గ్రామీణ ప్రాంతంలో విరివిగా పండే కూరగాయలు, పండ్లను రైతులు రాజాం మార్కెట్లో విక్రయానికి తెస్తుంటారు. సరైన రైతుబజార్ సదుపాయాలు లేక ఇక్కడి రైతులు రోడ్డుపైనే అమ్మవలసి వస్తుంది. ఎర్రచెరువు విస్తరణ, బలసల రేవులో నాగావళి నది మీదుగా వంతెన నిర్మించాలని రాజాం వాసులు దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. ఈ నదికి వరదలొచ్చినప్పుడల్లా నదినిదాటలేక ప్రజలకు రాకపోకలు నిలిచిపోతాయి.

ఇక తోటపల్లి, నారాయణపురం రిజర్వాయర్లు నుండి సాగునీరందించే ఎత్తిపోతల పధకం, మద్దివలస రిజర్వాయర్ను అభివృద్ధిచేసి, స్థానిక పౌరులకు ఉఫాధి అవకాశాలు పెంచవచ్చు.


శ్రీకాకుళం

ఇది పేరుకే జిల్లా కానీ ఇక్కడ అనేక సమస్యలున్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయ్. దీని పరిధిలో ఉన్న కళింగపట్నం పోర్ట్ దీనవస్థ స్థితిలో ఉంది. దీన్ని పర్యాటక ప్రదేశo గా మార్చి జీవనోపాధి కల్పించవచ్చు. చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇసుక అక్రమ తవ్వకాలు వలన ప్రతి ఏటా నది వరదలకు ముంపునకు గురవుతుంది.ఇక్కడ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు ఉన్న దాన్ని అభివృద్ధి చేయడం లేదు.


ఆముదాలవలస


ఇక్కడ అనేక ప్రజా సమస్యలున్నాయి ప్రధానమైనది సాగు, తాగు నీరు. తరాలుగా పాలకులు మంచినీరిస్తామని హామీలిస్తునే ఉన్నా , వాస్తవానికి వీరు గుక్కెడు నీళ్లకోసం గుక్కపట్టి ఏడవల్సిన పరిస్థితి. చుట్టూ నాగావళి, వంశధార, గోస్థనీ వంటి నదులున్నా, ఆ నీళ్లు వీరికి అందుబాటులో లేవు. భూర్జ మండలంలో నారాయణపూర్ బ్యారేజ్కి రెగ్యులేటర్ అమర్చి ఆధునీకరించే పనులు దశాబ్దాలుగా ఆలస్యం అవుతుంది. మూతబడిన సహకార రైతు చక్కర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని కూడా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ కర్మాగారంలో వేలాదిగా కార్మీకులు ఉఫాధి పొందేవారు. అది మూత పడటంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ హక్కులను APIIC కు అప్పగించడంతో ఇక్కడ రైతులు ఆగ్రహం చెందుతున్నారు. భూర్జ మండలంలో నాగావళి, వంశధార నదులను అనుసంధానించి, గుక్కెడు నీళ్ళే కదా వాళ్ళు అడిగేది, ఇస్తే సరిపోతుందికదా!. నీళ్లు జీవనాధారం ఇది లేకపోతే శ్రామికులంతా పొట్ట చేత పట్టుకుని వలస పోవలసిందే!


ఎచ్చెర్ల


సాగు నీటి విషయానికి వస్తే, నారాయణపురం ఎడమ కాలువ తోటపల్లె కాలువల ద్వారా సాగు నీటిని అందుబాటులోకి తెచ్చి, బుడమేరు చెరువును రిజర్వాయరుగా మార్పు చేస్తే , 58 వేల ఎకరాల సాగుభూమికి నీరందించవచ్చని అంచనా. బుడమేరు చెరువు నీళ్లు కలుషితమై నిరుపయోగంగా ఉంది. దీనిని సంరక్షించి, జలాశయంగా మారిస్తే ఈ ఒక్క చెరువునుండి 15,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. నీటిని నిలువచేసే రిజర్వాయర్ లేదు. నారాయణ సాగరం ఈ ప్రాంతంలో అతిపెద్ద మంచినీటి చెరువు. నీటి సంరక్షణకు ప్రాధాన్యమిస్తే, రెండు పంటలకు ఈ ప్రాంతంలోసాగు నీటికి, తాగునీటికి కొరత ఉండదు. పైడి భీమవరంలో అతిపెద్ద పారిశ్రామిక సముదాయం ఉన్నా స్థానికులకు మాత్రం అందులో అవకాశాలు లేవు. ప్రజలకు ఉఫాధి అవకాశాలు పెంచే వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకై పూనుకోకుండా ప్రభుత్వం అతిప్రమాదకరమైన అణు ధార్మికతను వెదజల్లే అణు విద్యుత్ కర్మాగారాన్ని కొవ్వాడలో నిర్మించ తలపెట్టింది. దీనికి స్థానికులనుండి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, ప్రజామోదం పొందే రీతిలో పరిశ్రమల స్థాపన జరిగితే అందరికి ఆమోద యోగ్యంగా ఉంటుంది.


నిర్లక్ష్యంగా వదిలేసిన సమస్యలు★


◆పౌష్టికాహార లోపం. ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న సమస్య పౌష్టికాహార లోపం. దీని వల్ల ప్రధానంగా సీతంపేట మండలంలో అత్యధికంగా ఉంది.2015 లెక్కల ప్రకారం ఇక్కడ 2,531,752 జనాభా వున్నారు.అందులో చదువుకున్న వారి సంఖ్య 10.50 % మాత్రమే. ఇక్కడ అనేక మంది రోగాలు బారిన పడుతున్నారు. ప్రధానంగా పౌష్టికాహారం లోపం, కనీస వైద్య సౌకర్యాలు లేకపోవడం.

National Rural Health Mission Andhrapradesh వారి లెక్కల ప్రకారం కింద వాటి వివరాలు ◆85% people suffering from Malaria Disease (100%) ◆Dengue 3.03% ◆Skin disease 15.58 % ◆Anaemia 55.45% (woman >Men) ◆Obesity 2 % ◆Goiter 8.82% ◆types of different diseases 4.87%


ప్రధాన కారణాలు.

◆ సరైన తాగునీటి వసతులు లేకపోవడం. ◆కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన మౌలిక సదుపాయాలు లేవు. ◆మలేరియా,డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలడానికి కారణం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం. ◆ అత్యవసర పరిస్థితుల్లో పట్నం ఆసుపత్రికి తరలించడానికి సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం.

కనీసం జిల్లాలో వుండే నాయకులు ఏజెన్సీ పరిధిలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలు తీర్చే నాయకులు లేరు.. స్వతంత్రo వచ్చి 7 దశాబ్దాలు అయిన పట్టించుకునే నాయకులు కరువయ్యారు.. గిరిజన(కన్నీటి) భారతం



జిల్లాలో కుల ధ్రువీకరణ పత్రాలు.


శ్రీకాకుళం జిల్లాలో ఎనేటి కొండ అనే ఒక గిరిజన తెగకు చెందిన వారికి గత 15ఏళ్లుగా వారికి caste certificate అనేది లేదు.జిల్లాలో జరిగిన ఒకరిద్దరు సమస్య వలన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మంత్రి వారికి ధ్రువీకరణ పత్రాలు రద్దు చేశారు. ఇప్పటికి ఎంతమంది నాయకులకి మొరపెట్టుకున్నా కనీసం స్పందించలేదు. వీరు జిల్లాలో 3 వేల కుటుంబాలు, దాదాపు పదివేల జనాభా పైగా వున్నారు. నాయకుల నిర్లక్ష్యం వల్ల వారికి ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ , సంక్షేమ పథకాలు అందడం లేదు. విద్యార్థులకి ఫీ రాయితీలు కానీ, ఉద్యోగాలకు కూడా Open కేటగిరీ లొనే దరఖాస్తు చేసుకోవలసిన పరిస్థితి.. నాయకులు వీరిని కేవలం ఓటర్లగానే చూస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రాల లేక గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.




Pending Projects in Irrigation Department

1. వంశధార స్టేజ్ -2, ఫేజ్2 దీనికి కావాల్సిన నిధులు 503 కోట్లు.

2. తోటపల్లి బ్యారేజ్ దీనికి కావలసిన నిధులు 316 కోట్లు.

3. మడ్డువలస స్టేజి 2 కావాల్సిన నిధులు 31 కోట్లు.

4.నాగావళి ఎడమ - కుడి కాలువ సిస్టమ్ తోటపల్లి బ్యారేజ్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కావాల్సిన నిధులు 170 కోట్లు.




పరిష్కారాలు


◆జిల్లాలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాలి. ◆విద్యార్థుల పై చదువుల కోసం యూనివర్సిటీ స్థాపించాలి. ◆నిరుద్యోగం నిర్ములించేందుకు పర్యావరణానికి హాని కలిగించని చిన్న మధ్య తరహా పరిశ్రమలు నిర్మించాలి. ◆కొబ్బరితోటలకి సంబంధించిన ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ◆తీరప్రాంతం ఎక్కువగా వుంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసి మత్స్యకారులకి తగినంత చేయుతనివ్వాలి. ◆వలస కార్మికులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం. ◆సరైన తాగునీటి మరియు రహదారి నిర్మాణం చేపట్టి మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించాలి. ◆జిల్లాలో పుణ్యక్షేత్రాలు (అరసవల్లి, శ్రీకూర్మం,శ్రీముఖలింగం, ఎండల మల్లికార్జున స్వామి,సాలిహుండం) ఎక్కువగా ఉన్నాయి వీటిని అభివృద్ధి చేస్టే పర్యటకంగాను మరియు నిరుద్యోగం కొంతవరకు తగ్గించవచ్చు


ఏళ్లుగా కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే చిక్కుకుపోవడం,

ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ,ఎన్నికల నాటికి వారిని కులాలు,మతాలు,వర్గాలు గా విడదీస్తూ,విభజిస్తూ లభ్ది పొందుతూ కాలం వెళ్ల దీస్తున్నారు నాయకులు.

అందుకే పదవులు అనుభవించే నాయకులు మారుతున్నారే తప్ప,ప్రజల జీవితాలు మారట్లేదు .

308 views1 comment

Recent Posts

See All

1 Comment


glnaidu13
Jul 30, 2019

Thanks.. Ma శ్రీకాకుళం గురించి బయట ప్రపంచానికి తెలియ చేసినందుకు, సమస్యలు అలానే ఉన్నాయి ..


Like
bottom of page