top of page
Writer's picture Tyler Durden

ఓడి నిలిచిన జనసేన



మే 23,2019 , పాతిక సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణానికి,సమాజంలో ఎందరో కోరుకున్న సమూల మార్పుకి ఆరోజు ఒక ముందడుగు పడుతుంది అని అనుకున్నారు,కానీ అందరి ఊహలకి,భిన్నమైన ఫలితం వచ్చింది. ఎవరూ ఊహించని ఘోర పరాభవం ఎదురైంది. నిస్వార్ధంగా పని చేసిన ఎందరో జనసైనికులకి తీవ్ర నిరాశనీ,నైరాశ్యాన్నీ,నిర్వేదాన్ని మిగిల్చిన ఫలితం అది. గుర్తుండిపోయే గాయంగా, మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిన రోజది.


అంతటి పరాజయం తరువాత జనసేన మనుగడపై, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై అందరికీ ఎన్నో ప్రశ్నలు,పార్టీ ఎలా నడుపుతాడు అనే అనుమానాలు,నాయకులు ఒక్కొకొకరుగా వెళ్లిపోతూ ఉంటే పార్టీ నిలబడుతుందా అనే ఆందోళనలు,అసలు నిధులే లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్ళడం ఎలా అనే భయాలు, ఇతర పార్టీలూ,మీడియా సృష్టించే అపోహలు, వీటన్నిటి నడుమ జనసేన నిలదొక్కుకుంది. ప్రజల కోసం జనసేన ఎప్పటికీ ఉంటుందీ అని రుజువు చేసింది ఈ ఆరు మాసాల కాలంలో,అదీ ఘోర ఓటమి తరువాత.


శ్రేయాన్సీ బహు విఘ్నానీ” అని సంస్కృతంలో ఒక సామెత ఉంది..అంటే ఒక గొప్ప పని చేయాలని సంకల్పించినపుడు,ఒక మంచి పని చేయాలని పూనుకున్నపుడు ఎన్నో ఆటంకాలూ, అవరోధాలు, అడ్డంకులూ ఏర్పడుతాయి... అంతా సులభంగా జరగనివ్వకుండా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి...వీటన్నిటినీ ఎదుర్కుంటూ అధిగమించి ముందుకు సాగినాకే అనుకున్న సమున్నత లక్ష్యం నెరవేరుతుందీ. జనసేన విషయంలో జరిగింది కూడా ఇదే.


పార్టీ అధ్యక్షుడే రెండు స్థానాల్లో ఓడిపోయాడు ఇంక పార్టీ మనుగడే ఉండదు అని విమర్శించిన వాళ్ళకి,ఒకే మాట ద్వారా సమాధానం ఇచ్చాడు జనసేనాని – మీలో నుండి నలుగురు వచ్చి నన్ను మోసే దాకా నేను జనసేనని మోస్తాను అని .ఓటమి తరువాత కూడా ఎక్కడ వెనక్కి తగ్గేదిలేదూ,ప్రాణం ఉన్నంత వరకూ ప్రజాసేవలో ఉంటాను అని సుస్పష్టం చేశాడు.





ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇచ్చి వారి పాలనా తీరుని బట్టి వారిపై విమర్శలు చేయాలి,అందునా పదవి యావ తప్ప ఏనాడూ ప్రజా సంక్షేమం పట్టని అనుభవ రాహిత్యంతో ఉన్న వైసీపీ వంటి వాళ్ళకి ఇంకొంత సమయం ఎక్కువే ఇవ్వాలి,పవన్ కల్యాణ్ చేసింది కూడా అదే. వారికి తగిన సమయం ఇచ్చాడు,ఈలోగా ఓటమిపై సమీక్షలూ,కార్యకర్తలతో సమావేశాలు,కమిటీల ఏర్పాటు వంటివి చేస్తూ పార్టీ నిర్మాణం వైపు అడుగులు వేశాడు జనసేనాని. పార్టీ నిర్మాణం చేస్తూనే ప్రజా సమస్యలపై స్పందిస్తూ వచ్చాడు.


వైసీపీకి వచ్చిన మెజారిటీ చూసి పాలన కూడా ఇతరులు వేలెత్తి చూపేలా ఉండదు అని అనుకున్నాడు జనసేనాని.. కానీ వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా తమదైన శైలిలో పాలన చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వచ్చింది. తద్ఫలితంగా వందరోజులు గడువు ఇచ్చి వంద రోజుల పాలన తరువాత వైసీపీ ప్రభుత్వ అసమర్ధ పాలనపై గళం విప్పాడు జనసేనాని.ఒక బుక్లెట్ రూపంలో వైసీపీ వైఫల్యాలు అన్నీ వివరించి,వారి పాలన వల్ల ప్రజలేలా ఇబ్బంది పడుతున్నదీ తెలియజేశాడు.



వైసీపీ నిర్లక్ష్య వైఖరి వల్ల తీవ్రంగా నష్టపోయి బతకలేక బతుకులేక చావే శరణ్యం అనే స్థాయికి వెళ్ళిన భవన నిర్మాణ కార్మికుల కష్టాలు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగేలా చేశాయి. ఓటేసి గెలిపించిన ప్రజలు కళ్ల ముందు పని లేక ప్రాణాలు తీసుకుంటూ ఉంటే కనీస స్పందన లేకుండా సమస్యని జటిలం చేస్తూ కూర్చున్న వైసీపీ వైఖరిని తీవ్రంగా ఎండగట్టాడు. ప్రభుత్వ నిర్లిప్తతకి నీరసనగా,85లక్షల భవన నిర్మాణ కార్మికులకి బాసట వారి గళం తానై వారి బలం తానై కదిలాడు,ఫలితంగా – ప్రభుత్వంలో కదలిక,ఇసుక విధానంపై చలనం చూపింది.


ప్రభుత్వం మీదే భారం వేయకుండా,తానూ భాద్యత తీసుకున్నాడు,ఆకలితో అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులకి జనసేన తరఫున మేమున్నాం అనే భరోసా ఇచ్చాడు,డొక్కా సీతమ్మ కాంటీన్లు ఏర్పాటు చేసి వారికి ఉచిత భోజన సదుపాయం కల్పించాడు,ఈ స్పూర్తితో అన్ని జిల్లాల్లో డొక్కా సీతమ్మ కాంటీన్లు ఏర్పాటు చేశారు జనసైనికులు. ప్రభువులు పీడిస్తుంటే పాలించే పదవుల కన్నా సేవించే చేతులు మిన్నా అని జనసేన రుజువు చేసింది.



పవన్ కళ్యాణ్ ఏనాటినుండో నిరసించేది – బలవంతులకి ఒకలా,బలహీనులకి ఒకలా చట్టాలు ఉండకూడదు,ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా ఉండాలి చట్టాలు అని.సుగాలీ ప్రీతి బాయి అనే బాలికకి జరిగిన అన్యాయం గురించి జనసేనాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. గత పాలుకులు అన్యాయం చేశారు మీరైనా న్యాయం చేయండి అని పదే పదే గుర్తు చేస్తూ వస్తున్నాడు. ప్రభుత్వ స్పందన లేకపోతే తానే స్వయంగా న్యాయంకోసం క్షేత్ర స్థాయిలో పోరాడుతానని స్పష్టం చేశాడు.


రైతు సమస్యలపై ఒక రైతుగా స్పందించాడు,ఒక సామాన్యుడి వేదన మరో సామాన్యుడికే అర్దం అవుతుంది అని రుజువు చేశాడు.రైతుల పక్షం వహించి వారి కోసం రైతు సౌభాగ్య దీక్షకి పూనుకున్నాడు. ఈ దీక్ష వల్ల రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయా అనేది కాదు..రైతులు తమ గొడుని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక వేదికని ఏర్పాటు చేశాడు.కష్టపడి పండించే అన్నదాత ఆ పంటని అమ్ముకోడానికి కష్టాలు పడకుండా చూడమని ప్రభుత్వాన్ని కోరాడు.




తెలుగు మధ్యమ రద్దు పై గలమెత్తాడు, జనసేనాని ఒకే మాటకి కట్టుబడి ఉన్నాడు – మాధ్యమాల ఎంపిక తల్లిదండ్రుల, విధ్యార్ధుల చేతిలో ఉండాలీ,ఒకే మాధ్యమాన్ని రుద్దకూడదు,ఎంచుకునే అవకాశం ఇవ్వాలీ అని.మీడియా ఆ వ్యాఖ్యాల్ని వక్రీకరించింది,నాయకులు తీవ్ర స్థాయిలో వ్యక్తుగత దాడికి దిగారు,చివరికి ఆంధ్ర ప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఇదే చెప్పింది.. ఎంచుకునే సౌలభ్యం ఇవ్వాలీ అని. ఎందరు వ్యతిరేకించినా తాని సత్యం మాట్లాడాడు. సత్యం వైపే నిలబడ్డాడు.


ఇవి మాత్రమే కాదు,మన నుడి మన నది అనే కార్యక్రమం చేపట్టాడు,జనసేన సిద్దాంతాలయిన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ది ప్రస్థానం,బాషల్ని గౌరవించే సంప్రదాయమ్,వీటి ఆచరణగా మన నుడి మన నది కార్యక్రమం ఏర్పాటు చేశాడు.


ఇవన్నీ ఒక ఎత్తు,రాజకీయ ప్రయాణంలో నాయకులు చేయాల్సినవి ఇవే.


ఈ ఆరు మాసాల్లో జనసేన పార్టీ కోల్పోయింది అవకాశ వాద రాజకీయ నాయకుల్నే.ఓటమిని చూసి జడిచే వారు ,అధికారం లేకపోతే నిలబడలేని వారు పార్టీని వదిలి వెళ్లారు. ఈ ఆరు మాసాల్లో జనసేన పొందింది “ప్రజల నమ్మకం” ఒక సమస్య ఉంది అంటే జనసేన ఆ సమస్యపై పోరాడితే పరిష్కారం లభిస్తుంది అనే ప్రజల నమ్మకాన్ని పొందింది,ప్రజల పక్షం వహించడానికి ఏ పదవీ అవసరం లేదు అని ప్రజలే అనేలా చేసింది. సామాన్యుల వేదన ప్రపంచానికి తెలియజెప్పాలి అంటే అందుకు జనసేన మాత్రమే వేదిక ఇస్తుంది,వారి పక్షాన పోరాడుతుంది, సమస్యకి పరిష్కారం ఇస్తుంది అని సామాన్య జనానికి ఒక నమ్మకం వచ్చేలా చేసింది..

ఆ నమ్మకమే ఎక్కడో నల్లమలలో గ్రామంలో ఉండే యువకుడు ఏ ప్రభుత్వాలనీ నమ్మకుండా,జనసేన అయితే సామాన్యుడి పక్షాన నిలబడుతుంది అని నమ్మి జనసేనానిని కలిసి తన వేదనని వెళ్లబోసుకుంటే ఆ యువకుడు ఆవేదనకి కార్యరూపం యురేనియం తవ్వకాలపై జనసేన పోరాటం,ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి,అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, ప్రభుత్వంలో కదలిక తీసుకొచ్చి తవ్వకాలు ఆగేలా చేసింది. ఇదే కదా గెలుపంటే


తానొడిపోయినా ప్రజలు ఓడిపోకూడదు అని ఎనభై లక్షల భవన నిర్మాణ కార్మికుల పక్షం వహించి పోరాడుతుంటే,మిమ్మల్ని గెలిపించుకోలేక పోయినందుకు క్షమించండి అన్నారు – ఇదే కదా గెలుపంటే


ఎక్కడ ఏ సమస్య వచ్చినా జనసేన రంగంలోకి దిగితే భాదితులకి న్యాయం జరుగుతుంది అనే ప్రజల నమ్మకం,విశ్వాసం ముందు ఈ సీట్లూ ఓట్లూ ఏమాత్రం


రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు నిర్లజ్జగా,నిస్సిగుగా అతి జుగుప్సాకరంగా మాట్లాడుతుంటే జనసేన ధర్మం వైపే నిలబడుతుందీ,న్యాయం కోసమే పోరాడుతుంది సత్యం మాత్రం మాట్లాడుతుంది అని ప్రజలకి అర్దం అవుతుంది – ఇదే కదా గెలుపంటే




నీతీ నిజాయితీలతో సమున్నత లక్ష్యం కోసం నిస్వార్ధంగా పోరాడే వారికి అవహేళనలూ, అవమానాలూ, అనుమానాలు, ఆడ్డంకులూ,సర్వ సాధారణం.. వీటన్నిటినీ భరిస్తూ సహిస్తూ లక్ష్యం దిశగా సాగిపోతేనే ఏదైనా సాదించగలరు.

జనసేన ప్రస్థానం ఇలానే ఉండబోతుంది...ఓటమిని చూసి అవహేళనలు చేస్తున్నారు,అధ్యక్షుడే ఓడిపోయాడు అని అవమానాలూ చేస్తున్నారు,పార్టీ మనుగడే ఉండదూ అని అనుమానాలు రేకెత్తిస్తున్నారు,ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ సృష్టిస్తున్నారు...

వీటన్నినీ అధిగమించి మనం కోరుకున్న గమ్యం దిశగా ,సమ సమాజ ఏర్పాటు దిశగా జనసేన ప్రయాణం సాగుతూనే ఉంటుంది.





8,449 views4 comments

4 Comments


kanthisuri
Jan 01, 2020

Pawan Kalyan sir you are great

Like

gopipantham143
Jan 01, 2020

Nuvu Emi chesina netho memu untamu....

Like

narasimha.raju6600
Dec 31, 2019

Annayya mi porata patimaki na hats off.

Like

narasimha.raju6600
Dec 31, 2019

Anna we are with you.proud to be a janasainik.

Like
bottom of page