శ్రీకాకుళం జిల్లా అంటే పచ్చని ప్రకృతికి జీవవైవిధ్యానికి పేరు. అలాంటి సిక్కోలు లో మాఫియా పడగ విప్పింది. ఒకవైపు కొండల్ని పిండి చేస్తున్నారు, ఇంకొక వైపు నదుల్లో ఉన్న ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ భూములను సైతం అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకున్న అధికారులు కానీ నాయకులు కానీ కరువయ్యారు.
అక్రమ మైనింగ్ పై చర్యలేవి ?
చుట్టూ కొండలు, విశాలమైన మైదానం, పచ్చని జీడితోటలతో నిండి వుండే ప్రాంతం శ్రీకాకుళం. పచ్చని శ్రీకాకుళం జిల్లాలో మైనింగ్ మాఫియా పడగ విప్పింది. ఈ మైనింగ్ వల్ల చుట్టూ ఉండే వన సంపద, జీవజాతులు దానికి ఆనుకుని వుండే చిన్న చిన్న గ్రామాలు,వన్యప్రాణులు అన్ని నాశనం అవుతున్నాయి.వీటి మీద ఆధారపడి జీవించే గిరిజనులు జీవనోపాధి కోల్పోతున్నారు. గ్రానైట్ తవ్వకాలు జిల్లాలో సీతంపేట, వీరఘట్టం, బామిని, మందస, పాలకొండ, టెక్కలి, కోటబొమ్మలి, నందిగం తదితర మండలాల్లో గ్రానైట్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రానైట్ తవ్వకానికి ఉపయోగించే పేలుడు పదార్థాల వలన వన్యప్రాణులు , చుట్టూ ఉండే గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.క్వారీ యజమానులు మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఈ గ్రానైట్ తవ్వకాల వలన పర్యావరణానికి హాని జరుగుతుంది అని పర్యావరణ ప్రేమికులు మొత్తుకున్నా పట్టించుకున్న నాధుడే లేడు. జిల్లాలో 60% పైగా అనధికారికంగా అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. కానీ దీని మీద ఇప్పటి వరకు అటు అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. జిల్లా మొత్తం దాదాపు ఇదే పరిస్థితి. సున్నపురాయి , గ్రానైట్ కోసం పచ్చని కొండల్ని నాశనము చేస్తున్నారు.చాప కింద నీరులా అక్రమ మైనింగ్ తో ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లాది రూపాయల మేర గండి పడుతుంది..సాధారణంగా ఎలాంటి ఖనిజాన్ని తవ్వాలన్నా, రవాణా చేయాలన్నా గనులు, భూగర్భశాఖ అనుమతులు తప్పనిసరి. అలాగే గనుల నుంచి తరలించే ఖనిజానికి ప్రభుత్వానికి క్యూబిక్‌మీటర్ల చొప్పున రాయల్టీ చెల్లించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే అది అక్రమమే అవుతుంది. జిల్లాలో గ్రానైట్, స్టియటైట్, సున్నపురాయి వంటి ఖనిజాలు స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.భావితరాలు ఎలా బ్రతకాలో అనే కనీసజ్ఞానంకూడా లేదు.
జిల్లాలో ఉండే నాయకులు 60:40 పద్దతిలో వాటాలు పంచుకుంటున్నారు. కనీసం ఇప్పటికైనా గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
ఇసుక మాఫియా :
శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియాకు C/o అంటే ఆముదాలవలస నియోజకవర్గం. ఒక వైపు వంశధార, ఇంకో వైపు నాగావళి నది కలిసి ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో అధికారికంగా 22 ఇసుక రాంప్ లున్నాయి వీటి ద్వారా దాదాపు 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యత ఉంది. కానీ కొత్త ఇసుక విధానం వల్ల సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటేనే అప్పులు చేయాల్సిన పరిస్థితి. ర్యాంప్ లన్ని దాదాపు అధికార పార్టీకి చెందిన నాయకుల చేతిలోనే ఉంటాయి. ఇక్కడ మామూళ్లు చెల్లించకపోతే ఇసుక తీసుకెళ్లడం కూడా కష్టం. నాయకులు ఇక్కడ నుంచి ఇసుకను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. అడ్డొచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. లారీల ద్వారా ట్రాక్టర్ ల ద్వారా అర్థరాత్రి సమయంలో ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇసుకను ఇతర ప్రాంతాలకు నాయకుల అండదండలతో ఇష్టం వచ్చినట్లు తరలిస్తున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల అక్రమ నిల్వలున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లాలో ఇదే తంతు కొనసాగుతుంది. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.
భూ కబ్జాలు :
శ్రీకాకుళం జిల్లాలో ఏ మూలకెళ్లినా భూముల్ని కబ్జా చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. జిల్లాలో కొన్ని వందల ఎకరాలు కబ్జాలకు గురయ్యాయి. దీనికి తోడు కబ్జాదారులకు నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు.శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు ఇదే పరిస్థితి. సోంపేట బీలభూములు దగ్గర నుంచి భావనపాడు పోర్ట్ నిర్మాణం కోసం భూసేకరణ చేశారు అక్కడ నాయకులు తమ వక్రబుద్దిని చూపెట్టి వందల ఎకరాలు కబ్జా చేశారు ఇప్పటి వరకు భాదితులకు సరైన నష్టపరిహారం అందలేదు.భావనపాడు పోర్ట్ వస్తుందన్న నేపథ్యంలో సంతబొమ్మాళి మండల పరిధిలో ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూముల విషయంలో కూడా ఇలాంటి అవకతవకలే జరిగాయి. 2017 లో ఇదే అంశంపై పవన్ కల్యాణ్ గారు భూ నిర్వాసితుల సభ కూడా నిర్వహించారు.
పాతపట్నం పోతే వేణుగోపాలస్వామి భూములు కబ్జా. రాజాం నియోజకవర్గ పరిధిలో భూ కబ్జాలకు అడ్డాగా మారింది. భూములు, చెరువులు, చివరకు శ్మశానాలను సైతం వదలడం లేదు కబ్జాదారులు. ఉమా రామలింగేశ్వర స్వామి భూములను కబ్జాదారులు నాయకుల పేరు చెప్పి అడ్డగోలుగా దోచుకుంటున్నారు.అడ్డొచ్చిన అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. పొందూరు మండల పరిధిలో రాపాక జంక్షన్ సమీపంలో సర్వే నెంబర్ ( 322-2 ) 1.88 ఎకరాల భూమిని కబ్జా చేశారు. సంతబొమ్మాళి లో బారిగండం చెరువును సైతం కబ్జా చేశారు. జిల్లాలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్న పట్టించుకోవట్లేదు. ఇంకెంతకాలం ఈ మాఫియా కొనసాగుతుంది. దీనిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి.
Comentarios