top of page
Writer's pictureSainika Swaram

రాజకీయ క్రీడలో దగా పడ్డ రాజధాని

దశాబ్ధాల నిర్లక్ష్యం దగాకోరు రాజకీయ నాయకుల దోపిడీ పర్వం సామాన్యుల బతుకుల్ని చిద్రం చేస్తే అసహనపు జ్వాలలు చెలరేగి, కమ్ముకున్న చీకట్లను పారద్రోలే విప్లవ దివిటీలు చేత బూని, రక్తపు మరకల రస్తాల్లో నడిచి, వందల ప్రాణ త్యాగాలు చేసి, స్వేచ్ఛా ఊపిరిలూదారు అమర వీరులు నా తెలంగాణం కి !!


విభజించిన వైనం లో తప్ప; శ్రామిక, కార్మిక, కర్షకుల్ని కబంధ హస్తాల్లో నలిపేసిన రాజకీయ నాయకుల దుర్మార్గపు ఆలోచనల్లో తప్ప; రెండు ప్రాంతాలుగా విడిపోయిన ప్రజల్లో సోదర భావం అలానే కొనసాగుతోంది అప్రతిహతంగా !


తమ గెలుపు కోసం మేదో మథనం చెయ్యడానికి కూర్చున్న చోటు నుంచి లేవకుండా గంటలు గంటలు సమావేశాలు నిర్వహించుకునే యూపీయే రాష్ట్ర విభజనను మాత్రం దేశం కళ్ళు గప్పి దేశానికి దేవాలయం అయిన పార్లిమెంట్ తలుపులు మూసేసి లైవ్ ఆపేసి పని చక్కబెట్టేసింది !


సరే అది అప్రస్తుతం ! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం - 2014 ప్రకారం హైదరాబాద్ మహా నగరం ఆంధ్రా తెలంగాణ లకి పదేళ్ల వరకూ ఉమ్మడి రాజధానిగా ఖరారు చేయబడింది అన్న విషయం ప్రజలెల్లరకూ విస్పష్టమే !!


అది వరకే వరుసగా రెండు సార్లు ఓడిపోయిన, ఒక్కసారీ సొంతంగా గెలవలేకపోయిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాడు 2014 లో స్వయాన కళ్యాణ్ గారి కోసం కొంత సమయం జనసేన కార్యాలయం వద్ద నిరీక్షించి తదుపరి కలిసి మద్దతు కోరడం జరిగింది


నాటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలనే ఆకాంక్ష తో కళ్యాణ్ గారు ఆ అభ్యర్థనను సమ్మతించడం జరిగింది ! 2014

సార్వత్రిక ఎన్నికలకు మునుపు నాటి రాష్ట్ర స్థితిగతులపై జరిగిన చర్చలో చంద్రబాబు గారు కళ్యాణ్ గారికి చెప్పిన మాటలు


కళ్యాణ్ గారూ రాజధాని నిర్మాణానికి ఒక 1800 ఎకరాలు సరిపోతాయి కాబట్టి భూమిని సేకరించాల్సిన / సమీకరించాల్సిన అవసరం ఉండదు అటవీ భూముల్ని కేంద్రం, అటవీ శాఖ అనుమతులు తీసుకుని డీ నోటిఫై చేసి రాజధానిని నిర్మిద్దాం అని !


సరే ఈ అంశానికి మళ్లీ వద్దాం ! 2014 లో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి పగ్గాలు చేపట్టిన తేదేపా ఆనతి కాలంలోనే తన వక్ర బుద్ధిని చూపించడం ప్రారంభించింది..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణానికి బదులు తమ పార్టీని పునర్నిర్మించుకోడం మొదలెట్టింది !!


అందులో భాగంగానే నాడు 2015 జూన్ నెలలో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో ఓటు కోసం కోట్లు వెదజల్లే ప్రయత్నం లో తెదేపా అధినేత అడ్డంగా దొరికిపోయిన క్యాష్ ఫర్ ఓట్ ఉదంతం ఇరు రాష్ట్రాల ప్రజలకూ తెలిసిన జ్ఞప్తికి ఉన్న విషయమే !!


తమ వ్యక్తిగత లబ్ధి కోసం, తమ స్వార్థ పూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ఒక్క క్షణం లో చిదిమేసారు చంద్రబాబు గారు ! పదేళ్లు ఉమ్మడి రాజధాని గా హైదరాబాద్ పై ఉన్న సర్వ హక్కుల్ని కోట్ల మంది ఆంధ్రులు కోల్పోవడానికి, ఆ దౌర్భాగ్య స్థితి దాపురించడానికి కారణం చంద్రబాబు గారు !!


ఉన్నపళంగా హుటాహుటిన రాత్రికి రాత్రే తట్టా బుట్ట సర్దుకుని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్లిపోవాల్సిన దుస్థితికి కారణం చంద్రబాబు గారు ! అంతటితో ఆగారా అంటే లేదు..తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూనే కొనసాగించారు తన పయనాన్ని, పతనాన్ని !


తమ అనుకూల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ను పట్టుకుని అమరావతి లో అమరావతి తప్ప లండన్ సింగపూర్ టోక్యో ఇస్తాంబుల్ లాంటి ఎన్నో మహా నగరాలు నిర్మించేశారు చంద్రబాబు గారు ! స్పెషల్ ఫ్లైట్లేస్కుని గిరా గిరా తిరిగి తీసుకొచ్చింది ఎంటీ అంటే ప్రజల సొమ్ముతో కట్టిన బిల్లుల రశీదులు !!


ఒక దేశ ప్రధానికంటే కూడా ఎక్కువ గా విదేశీ యాత్రలకు వెళ్ళిన ముఖ్యమంత్రుల్లో చంద్ర బాబు గారే ప్రధమం అయి ఉంటారు. ఆయన 2014 లో పదవి చేపట్టిన దగ్గర నుంచి పెట్టుబడుల పేరిట తిరిగిన దేశాలు చైనా రెండు సార్లు , సింగాపుర్ మూడు సార్లు, మలేషియా, లండన్, అమెరికా. చైనా నుంచి కుదుర్చుకున్న ఒప్పందం 38000 కోట్లు అని, విశాఖపట్నం లో పెట్టిన investment fair నుంచి 5 లక్షల కోట్ల MOU లు సంతకాలు చేసుకున్నాం అని అనేక వార్తలు చూశాం. ఆయన మొత్తం విదేశీ ప్రయాణాల ఖర్చు అక్షరాల 39 కోట్ల రూపాయాలని ప్రస్తుత ఆర్ధిక మంత్రి అసెంబ్లీ లో చెప్పిన మాట విధితమే !!


లోగడ చెప్పినట్టు కేవలం 1800 ఎకరాలు చాలు రాజధానికి అని చెప్పిన ఈ పెద్ద మనిషి రాజధానితో రియలెస్టేట్ వ్యాపారం మొదలెట్టారు ! వేలకు వేల ఎకరాలు ఆరుగాలం కష్టించి పనిచేసే రైతుల కడుపు కొట్టి లాక్కున్నారు నిర్దయగా ( కొంతమంది తమ ఇష్టం తోనే ఇచ్చినా కొంత మంది తప్పక ఇవ్వాల్సి వచ్చింది)


అయితే నలభై ఏళ్ల అనుభవం, హైదారాబాద్ కట్టిన తాపీ మేస్త్రి నేనే, అన్ని దేశాల అధినేతల్ని కలిసి భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసింది నేనే అని చెప్పుకు తిరిగే మాన్యశ్రీ చంద్రబాబు గారికి ఒక రాజధాని ని నిర్మించడానికి పట్టే కాలం, తొలుత అవసరమయ్యే భూమి వైశాల్యం గురించి సరైన అవగాహన లేకపోవడం విడ్డూరం !


నరేంద్ర మోడీ - పవన్ కళ్యాణ్ ద్వయం మద్దతుతో గెలిచిన మీరు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చకపోతే మీరూ మీ పార్టీ గంగలో కలిసిపోవాల్సిందే అన్న చేదు నిజం గ్రహించలేదా లేక ఎలాగూ రెండో సారి అధికారం లోకి వచ్చే అవకాశం లేదు దొరికిన కాడికి దోచుకుందాం అని ఫిక్స్ అయ్యారా !


ఒక వేళ మీరూ మీ పార్టీ మళ్లీ అధికారం లోకి రాకపోతే ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చిన రైతులకు భరోసా ఎలా అనే చిన్న పాటి ఆలోచన కూడా చేయ లేని మీరు విజనరీ ఎలా అవుతారు సార్ ?! ఎక్కడైనా బ్యాలెన్సింగ్ ఉందా.. బొత్తిగా లేదు !!


ఈ రోజున చిన్న కంపెనీలో సైతం వెర్బల్ గా చెప్పే దానికి విలువుండదు.. ఒక పేపర్ మీదనో ఈ మెయిల్ లో నో సమాచారం నిక్షిప్తమై ఉంటేనే భవిష్యత్తు లో అది ఒక ఆధారంగా చూపించుకునే వెసులుబాటు ఉంటుంది సంభందిత ఉద్యోగికి !


మరి అలాంటిది వేల మంది రైతులు వేల ఎకరాలు వారి పిల్లల భవిష్యత్తు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని; భూములు ఇచ్చిన రైతులకు భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బంది రాకుండా తగు భద్రత కల్పించాలన్న ఆలోచన కూడా లేని మీరు హైదరాబాద్ ని కట్టింది నేనే అని ఎలా డప్పు కొట్టుకుంటారు సార్ !?


రైతు స్వేదం తో తడిసి నాగలి స్పర్శ తో మురిసి వాన చినుకుల్తో కలిసి అన్నపూర్ణ లా ఆ నేల తల్లి మన కడుపును నింపుతుంది కదా మరి అలాంటి అన్నపూర్ణ ని ఈ రోజున పంటలు వేసుకోవడానికి కూడా పనికిరాకుండా చేసేసిన మీరు అనుభవజ్ఞులు ఎలా అవుతారు సార్ ?!


అసలు ఇవన్నీ కాదండీ అమరావతి రాజధాని అని గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువరించని మీరు ఎలా అపర చాణక్యుడు అవుతారు, ఎలా నలభై ఏళ్ల అనుభవజ్ఞుడు అవుతారు, ఎలా విజనరీ అవుతారు సార్ !?


ఆ రోజున ఉండవల్లి పెనుమాక బేతపూడి గ్రామాల రైతులు మీరు ప్రయోగిస్తున్న ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేఖించి బలవంతపు భూ సమీకరణను ప్రభుత్వం ఆపేలా మీరు చొరవ చూపాలని కళ్యాణ్ గారిని కోరితే ఆ రోజున కళ్యాణ్ గారు ఆయా గ్రామాల్ని సందర్శించి బలంగా చెప్పిన మాటలు


> ఈ రోజున మీరు అధికారం లో ఉన్నారు, రేపటి రోజున వేరే పార్టీ అధికారం లోకి వస్తే వాళ్ళు ఒక వేళ రాజధానిని మార్చేసే ఆలోచన చేస్తే ఈ రోజున భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి ? వాళ్ళకి ప్రభుత్వం తరుపున బాకీ పత్రాలు ఇచ్చారా, భద్రత కల్పించారా ?!

> హైదరాబాద్ లాంటి మహా నగరం ఈ రోజున్న స్థాయికి చేరడానికి సుమారు నాలుగైదు దశాబ్దాలు పట్టింది అలాంటిది అమరావతి నిర్మాణం ఐదు పదేళ్లలో జరుగుతుందా ?! అది జరగని పని..మరి ఆ క్రమంలో ఇన్ని వేల ఎకరాలు తీసుకుని; పంటలు పండించి నోటికి ముద్దని అందించే రైతుల ఆశల్ని జీవితాల్ని అభివృద్ధి పేరిట నరికెయ్యడం ఎంతవరకూ సమంజసం ?!


ఇలా కళ్యాణ్ గారు సూటిగా అడిగిన ప్రశ్నలకు ఆ రోజున గౌరవ మంత్రులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు అన్న మాటలు ఏంటో తెలుసా అండీ ?


> పవన్ కళ్యాణ్ అభివృద్ధి నిరోధకుడు

> పవన్ కళ్యాణ్ కి అనుభవం లేదు

> పవన్ కళ్యాణ్ రాజధాని రైతుల్ని రెచ్చగొడుతున్నాడు


అంటూ పలు పలు విధాల విమర్శించింది వార్తలు వండి వార్చి వడ్డించింది మీరూ మీ పత్రికలు మీ వార్తా ఛానెళ్లు కాదా ?!

మీ విజయానికి దోహదపడిన వ్యక్తి మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోమంటే మీరు ప్రతిగా ఇచ్చిన బహుమానం తిట్లు !!


సో ఆ తరువాత అక్కడితో భూ సమీకరణ ఆపేశారు, ఆ తరువాత వరుస పెట్టి డిజైన్లు గ్రాఫిక్కుల జిమ్మిక్కులతో కాలం నెట్టుకుంటూ వచ్చేశారు ! ప్రధాని గారిని తీసుకొచ్చి అమరావతి కి పునాదైతే వేశారు గాని మీరు చెప్పిన ఆకాశ హర్మ్యాలు లేవు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తో నిర్మితమైన ఐటీ కంపెనీలు లేవు, విద్యా సంస్థలు లేవు, ఉపాధి అవకాశాల కల్పన లేదు ! అంతా ఈనాడు ఆంధ్రజ్యోతి లో తప్ప అమరావతి లో జరిగిన అభివృద్ధి అయితే శూన్యం !!


ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 67 సీట్లు గెలిచి బాధ్యతాయుతమైన ప్రతి పక్షం స్థానం లో ఉన్న యుశ్రారైకాపా పార్టీ గానీ ఆ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి మాన్యశ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు గానీ ఆ రోజున రైతుల తరుపున పోరాడిన దాఖలాలు లేవు, ప్రభుత్వాన్ని బలంగా నిలదీసిన సంఘటనలు లేవు !


శ్రీ జగన్ గారు ఆ రోజున అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పింది "ఇప్పటికే రాష్ట్రం రెండు గా విడిపోయింది ఇప్పుడు మళ్లీ రాజధాని ఈ ప్రాంతం లో ఆ ప్రాంతం లో అంటూ మాట్లాడి వేర్పాటు వాదానికి మేం బీజం వెయ్యాలి అనుకోవట్లేదు కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాష్ట్రానికి మధ్యలో రాజధాని మాకూ సమ్మతమే అని చెప్పారు !!


తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో అమరావతి లో పార్టీ ఆఫీస్ నిర్మించుకుని సొంత ఇల్లు కట్టుకుని నేను ఇక్కడే ఉంటాను తదుపరి అధికారం లోకి వచ్చేది మా పార్టీనే రాజధాని అమరావతి నుండి కదిలే ప్రసక్తే లేదు అంటూ ప్రతిజ్ఞ లు చేశారు, ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు !!


ఆయనకు ధీటుగా వారి పార్టీ నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, శ్రీమతి రోజా సెల్వమని గారు, శ్రీ పేర్ని నాని గారు, శ్రీ జోగి రమేష్ గారు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఓ చాంతాడంత లిస్ట్ వస్తుంది లెండి సో వీళ్లంతా జగన్ గారి స్టేట్మెంట్ నే పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు !!


కానీ ఈ రోజున అధికారం లోకి వచ్చిన తరువాత అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి దానికి మూడు రాజధానుల ఖచ్చితంగా కావాల్సిందే అని కొత్త పల్లవి అందుకున్నారు జగన్ గారు ! మరి మీకు ఈ ఆలోచన ఉండి ఉంటే ఆ రోజున వేల మంది రైతులు వేల ఎకరాలు ఇచ్చిన సందర్భం లోనే చెప్పుండాలి కదా ఎందుకని మౌనంగా ఉన్నారు ?!


తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సం తో శ్రీకాకుళం జిల్లా అంతా అతలాకుతలం అయిపోతే పక్కనే విజయనగరం జిల్లాలో ఉన్న మీరు మీ యాత్రను ఆపుకున్నారు తప్ప సిక్కోలు వెళ్లి ప్రజలతో ఉండే ప్రయత్నం చెయ్యలేదు కానీ కళ్యాణ్ గారు పది లక్షల మందితో చేసిన ధవళేశ్వరం కవాతు సక్సెస్ ని ఒక గంట కూడా ఆస్వాదించకుండా హుటాహుటిన వెళ్లి తుఫాను ప్రాంతాలని సందర్శించి, ఆ చీకట్లలోనే దీపావళి సైతం జరుపుకుని వారిలో మనో ధైర్యాన్ని నింపారు, అంతే కాదు కేంద్రానికి లేఖ రాసి 300కోట్లు తుఫాను బాధితుల సహాయార్ధం విడుదల అయ్యేలా చేయగలిగారు !


ఉద్ధానం గురించి కళ్యాణ్ గారి శ్రమ అందరికీ తెలిసిందే, కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల్ని ప్రపంచానికి తెలియజేసి హార్వర్డ్ నుంచి వైద్యుల్ని తీసుకొచ్చి ఉద్ధానం కోసం బలంగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ! శ్రీ జగన్ గారు ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఒక్కసారైనా అసెంబ్లీలో ఉద్ధానం ప్రజల అంశాన్ని లేవనెత్తారా ?!


సహజ వనరులు పుష్కలంగా ఉన్నా దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోక రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి గురై వెనక్కి నెట్టివేయబడ్డ ఉత్తరాంధ్ర !


ఈ రోజున అక్కడున్న భూముల్ని హస్తగతం చేస్కొని ఎన్నికల్లో మీరు పెట్టిన పెట్టుబడికి రెండు మూడింతలు వెనక్కి రాబట్టుకోవడానికి విశాఖ పట్నం ని కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించడం తప్ప ఉత్తరాంధ్ర మీద ప్రేమతో కాదు అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం !


ఎందుకంటే మీ చిత్తశుద్ధి త్రికరణ శుద్ధి తిత్లీ తుఫాను సమయం లో మీరు అవలంభించిన వైఖరి తేటతెల్లం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారూ !


ఈ రోజున విశాఖ పట్నం లో వరుస పెట్టి కర్మాగారాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని అరికట్టడానికి ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆడిట్ కట్టుదిట్టంగా నిర్వహించలేని ప్రభుత్వం రాజధానిని నిర్మించేస్తాం అభివృద్ధి చేసేస్తాం అనడం హాస్యాస్పదం !


మీరు చెప్పినట్టు అమరావతి లో తెదేపా ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడితే, ఇప్పుడు అధికారం లో ఉన్న మీరు వచ్చిన వెంటనే ఒక కమిటీ వేసి సమగ్ర దర్యాప్తు జరిపించి నివేదిక సిద్ధం చేసి ఈ పాటికే కేసులు పెట్టి దోషులకి తగిన శిక్షలు పడేలా చేసి అమరావతి రైతులకు న్యాయం చేసి రాజధాని నిర్మాణాన్ని అమరావతిలో నే కొనసాగించాలి !!


కానీ అలా మీరు చేశారా లేదు చెయ్యలేదు ఎందుకంటే మీకూ తెదేపా కి తెర చాటు ఒప్పందాలు 60:40 వాటాలు ! వాళ్ళు అధికారం లో ఉంటే మిమ్మల్ని మీరు అధికారం లో ఉంటే వాళ్ళని కాపాడుకుంటూ వస్తారు !


అమరావతి లో వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు, వైజాగ్ లో మీరు ! అంతే తేడా మిగతాదంతా సేమ్ టూ సేమ్ !!


కర్నూలు లో జ్యుడీషియల్ క్యాపిటల్ పెట్టినంత మాత్రాన రాయలసీమ ఆడపడుచుల కష్టాలు, రైతుల కష్టాలు, వలసలు ఆగవు ! మీకు నిజం గానే రాయలసీమ అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి ఉంటే రైతుకి నీరు అందివ్వండి, వ్యవసాయంలో అధునాతన సాంకేతికత రైతుకు అందివ్వండి. ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు వచ్చేలా చూడండి, వలసలు ఆపండి అంతే గాని కేవలం కర్నూలు లో హైకోర్టు పెట్టి అభివృద్ధి అయిపోయిందంటే అది నమ్మశక్యంగా లేదు !


రాష్ట్ర చరిత్రను గనక ఒక్కసారి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అవిభాజ్య రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రులు సీమ నుంచి వచ్చిన వాళ్ళే, దివంగత నేత శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి గారు కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి గా ఎన్నికైన వారే ! అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోని రాయలసీమ, దశాబ్ధాలుగా క్షామం తో అల్లాడిపోతున్న రాయలసీమ, నాయకుల కుటుంబాల అభివృద్ధి తప్ప సామాన్యుడి అందని అభివృద్ధి ఫలాలతో క్షోభిస్తున్న రాయలసీమ నేడు కర్నూలు లో జ్యూడీసియల్ క్యాపిటల్ రాక తో ఏ మేరకు అభివృద్ధి చెందుతుందో ఎన్ని TCS లు ఎన్ని Infosys లు ఎన్ని Wipro లు వస్తాయో పెరుమాళ్ కే ఎరుక !!


గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారం లోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది ఈ కాల వ్యవధిలో పత్రికా ప్రకటనల కోసం, గ్రామ సచివాలయాలు మొదలుకుని చెట్లూ చేమలు వరకూ తమ పార్టీ జెండా రంగులు వెయ్యడానికి(హై కోర్టు మొట్టికాయ తో మళ్లీ తొలగించడానికి), ప్రచార ఆర్భాటాలకి, తాడేపల్లి నివాసం కి మరమ్మత్తులకు, లోటస్ పాండ్ మరమ్మత్తులకు, కొత్త కొత్త శాఖలు సృష్టించి లక్షలు లక్షలు జీతభత్యాలు ఇచ్చేందుకు, మంత్రుల నివాసాలకు ప్రతీ నెలా అద్దెలు చెల్లించేందుకు ఇలా లక్షలూ, కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూనే ఉన్నారన్నది వివిధ జీఓ ల ద్వారా చూశాం చూస్తూనే ఉన్నాం !


వచ్చిన మొదటి ఏడాది లోనే సుమారు 80వేల కోట్ల పై చిలుకు అప్పులు చేసి సంక్షేమ పథకాలకి ఖర్చు చేయడం తప్ప "అది కూడా వంద రూల్స్ పెట్టి అమ్మ ఒడి లో సగం మంది లబ్ధి దారుల్ని తొలగించేశారు, పెన్షన్ ఒకేసారి పెంచుతాం అని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చాక ఏడాదికి 250 లెక్కన పెంచుతూ పోతున్నారు..అంతేనా రైతు భరోసా పథకం కింద 12500 ఇస్తాం అని హామీ ఇచ్చిన వైసీపీ అధికారం లోకి వచ్చాక కేంద్రం ఇచ్చే 6000 కలుపుకుని 13500 ఇచ్చి మొత్తం తామే ఇచ్చినట్టు డప్పు కొట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే ! ఇంతవరకూ అప్పులు డాబులు రంగులు తప్ప అభివృద్ధి ఫలాలు ఆంధ్ర ప్రదేశ్ కి అందించిన దాఖలాలు లేవు !


మరి అలాంటి పరిస్థితుల్లో ఒక రాజధాని కాదు మూడు రాజధానులు నిర్మిస్తాం అని చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారూ అది ఎలా సాధ్య పడుతుంది అనుకుంటున్నారు ? నిధులు ఎక్కడినుంచి తీసుకొస్తారు, కొత్త అప్పులు ఎక్కడినుంచి తెస్తారు ?! జీతాలు ఎలా ఇస్తారు సంక్షేమ పథకాలకు డబ్బులు ఎలా ! వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తిరిగి ఆర్థిక భారం అంతా సామాన్యుడి పైనే పడుతుంది పన్నుల రూపంలో !!


సార్ మధ్యపాన నిషేధం హామీనే సరిగ్గా నెరవేర్చలేకపోయిన మీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తాం అంటే నమ్మశక్యంగా లేదు సార్ !!



కాబట్టి ప్రజలారా

> పదేళ్ల ఉమ్మడి రాజధాని పై మనం హక్కులు కోల్పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు

> అమరావతికి వేలకు వేల ఎకరాలు తీసుకుని రైతులకు ఎలాంటి భరోసా కల్పించనిదీ, ఎలాంటి బాకీ పత్రాలు ఇవ్వనిదీ చంద్రబాబు గారు

> ఐదేళ్లు గ్రాఫిక్కులతో కాలం గడిపేసింది చంద్రబాబు గారు

> నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి సై అని సొంతిల్లు పార్టీ ఆఫీస్ కూడా కట్టి ఇక్కడే ఉంటాను అమరావతి ఇక్కడే అని ప్రజల్ని నమ్మించి ఈ రోజున మూడు రాజధానులకు తెర లేపింది జగన్ మోహన్ రెడ్డి గారు


> మొదటి నుంచీ వేల ఎకరాలు రైతుల నుంచి ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళకి భరోసా ఎక్కడ బాకీ పత్రాలు ఎక్కడా అని ప్రశ్నించింది పవన్ కళ్యాణ్

> రేపటి రోజున ప్రభుత్వం మారితే భూములు ఇచ్చిన రైతులు ఇబ్బందులు పడాలి అని ముందునుంచీ చెప్తున్నదీ పవన్ కళ్యాణ్

> ఆ రోజున పెనుమాక ఉండవల్లి బేతపూడి రైతుల తరుపున బలంగా తన గొంతు వినిపించింది పవన్ కళ్యాణ్, ఈ రోజున రైతులకు అండగా ఉంటాం అని బలంగా చెప్తోంది పవన్ కళ్యాణ్

> అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ పరిపాలన వికేంద్రీకరణ కాదు మేం పరిపాలన వికేంద్రీకరణ కి వ్యతిరేకం అని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు చాలా బలంగా

> ఉత్తరాంధ్ర లో ఉద్ధనం సమస్య మొదలుకుని తిత్లీ తుఫాను సమస్య వరకూ ఉత్తరాంధ్ర కోసం బలంగా తన గళం వినిపించింది పవన్ కళ్యాణ్ గారు


దీనిని బట్టి రాజధాని విషయం లో తప్పు చేసింది ఎవరు, ప్రజల పక్షాన తొలి నుంచీ నిలబడింది ఎవరూ అన్న విషయం మీద మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుందనే ఆశిస్తున్నాను ! ఇప్పటికైనా ఈ తెదేపా వైసీపీ నాయకుల మోసాలు సునిశితంగా గమనించి మసలుకోవాలని వినయ పూర్వక మనవి ! జై హింద్ !!

393 views3 comments

Recent Posts

See All

3件のコメント


mohanannadanam1
2020年8月05日

యు శ్రా రైకాపా రాజధానిని తరలిస్తామని చెప్తున్నాయి కానీ తరలించిన తరువాత ఆ ప్రాంతాలను అభివృధి ఎలా చేస్తాం అని చెప్పినట్టు ఎక్కడ చూడలేదు. గత 5 సవత్సరాల కాలంలో జరిగిన రాజకీయ క్రీడలో ఆంధ్రుల రాజధాని అంశం పావుగా మారడం దురదృష్టకరం. వీరి రాజకీయ విన్యాసాలకు భయపడిన తెలంగాణ ప్రజలు ఈ నాయకులు మాకు వద్దు అని ఉద్యమించి తమ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు.చూస్తుంటే కళ్యాణ్ గారు 2019 లో చెప్పినట్టుగా సుస్థిర రాజకీయ వ్యవస్థ అవసరం అని తోస్తుంది.

いいね!

lohith.lohith9
2020年8月05日

చాలా బాగా జరిగిన సంఘటనలను వివరించారు.

いいね!

Sheetal Paidimarri
2020年8月05日

అద్భుతమైన వివరణ...

いいね!
bottom of page