top of page
Writer's pictureSainika Swaram

అమ్ముడు పొయిన అక్షరం-విలువలు వదిలేసిన మీడియా


ఎవరో ఎక్కడో చెప్పినట్టు “Who Ever Controls the Media, Controls the Mind” అంటే ఎవరైతే మీడియాని కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఇతరుల మనసుని, ఆలోచనలను కూడా కంట్రోల్ చేస్తారు. ఈ మాట చాలా వరకు నిజం కూడా

శాసన వ్యవస్థ, కార్యనిర్వహక వ్యవస్థ మరియు శాసన వ్యవస్థ మూల స్తంభాలుగా ఉన్న భారత దేశంలో మీడియా వ్యవస్థను నాలుగవ స్తంభంగా అభివర్ణించి మిగిలిన వ్యవస్థలలో జరిగే లోటుపాట్లను ప్రజలకు నిస్పక్షపాతంగా అందిస్తుంది అందించాలి అని ఆకాంక్షిస్తూ అంతటి మహోన్నత స్థానాన్ని కల్పించడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో గత 15-20 సంవత్సరాలలో మీడియా రంగంలో వచ్చిన మార్పులు తనని తాను అతఃపాతళంలోకి నెట్టుకుంది.

1991 భారత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాక మీడియా వ్యవస్థలో అనేక సంస్కరణలు వచ్చాయి. అంతకు ముందు కేవలం టీవీలో దూరదర్శన్, మరియు రేడియోలో వచ్చే వార్తలే ప్రభుత్వ వాణిని అత్యధికంగా వినిపించినప్పటికి పత్రికా రంగంలో వామపక్ష భావజాలాలు కలిగిన పత్రికలు ప్రభుత్వ వ్యతిరేక వాణిని మరియు ప్రజా సమస్యలను అధికంగా వినిపిస్తూ వచ్చేది. ఇలా ఉన్న తరుణంలో 1975 ఇందిరా గాంధి హయాంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో కూడా మీడియా ప్రజా గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తూ ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా ఎంతో కీలక పాత్ర పోషించింది. తరువాత తరుణంలో అనేక స్కాంలు, అవకతవకలు, అనేక లంచగొండులను, రౌడీలను ప్రజల ముందు నిలబెట్టి అనేక అరాచకాలను రూపు మాపడంలో తన వంతు పాత్ర పోషించిన మీడియా . నేటి ఈ సమయంలో మీడియా పోకడలు చూస్తుంటే వీరికి ఒకప్పుడు మన దేశంలో ఇచ్చిన స్థానం(4th పిల్లర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ) నిజంగా వర్తిస్తుందా అని సందేహం కాగాక మారదు.


ఒకప్పుడు తమ వ్యక్తిగత అభిప్రాయాలు అజెండాలు ఉన్నప్పటికీ వీలున్నంత వరకు అవి సంపాదకీయం వరకు పరిమితం చేస్తూ సద్విమర్శ చేస్తూ పత్రిక విలువలు కలిగిన పాత్రికేయులు, సంపాదకులు కలిగిన పత్రిక వ్యవస్థ. కానీ ఆర్థిక సంస్కరణల భాగంగా/అనంతరం ఇదే మీడియా వ్యవస్థలో పెట్టుబడులు పెట్టిన అనేక వ్యాపారవేత్తలు కానీ ఇతరులు కానీ ప్రవేశించక ముందు 80% ప్రజలకు సరైన వార్తలను అందించిన ఈ వ్యవస్థలు అనంతరం అది సుమారు 60% వరకు పడిపోయింది అని విమర్శలు కలిగిన గుడ్డి కంటే మెల్ల మేలు కదా అన్నట్టుగా సాగింది. అనంతరం పార్టీ వ్యక్తులు, లేదా ఈ మీడియా అధిపతులు రాజకీయాల్లోకి అరంగేట్రం అనంతరం మీడియా పూర్తిగా తన రంగుని మార్చుకుంది. ప్రజలకు వారి సమస్యల గురించి ప్రస్తావించడం మానేసి తాము భుజాన వేసుకున్న పార్టీ లేదా నాయకులు చేసే పనులు ప్రచారం కల్పించడం(ఇది ఒకందుకు పర్లేదు) లేదా తమ ప్రత్యర్థులు ఏదైనా మంచి చేస్తే ప్రచారం కల్పించకపోవడం లేదా అందులో ఏవైనా తప్పు ఉంటే విపరీతమైన వ్యతిరేకత ప్రచారం చేయడం, అదే తమ నాయకుడు చేస్తే అత్యంత మంచి అన్నట్టు చెప్పడం పరిపాటిగా మారింది. దీనినే కొంచెం ముతకగా ఉన్న తాము భుజాన వేసుకున్న వాళ్ళు చేస్తే సంసారం, ప్రత్యర్థులు చేస్తే ******* అన్నట్టుగా మారింది.


ఇప్పుడున్న పరిస్థితులలో పత్రిక, ఛానెల్ పేరు చెప్తే అది ఏ పార్టీకి కొమ్ము కాస్తుందో చెప్పే స్థాయికి భారత దేశ నాల్గవ స్తంభం దిగజారింది అని చెప్పడానికి బాధతో సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇక మన రాష్ట్ర మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేవారు ఉన్నారు అయినప్పటికీ ఒకసారి సింహావలోకనం చేసుకుందాం.


వామపక్ష పత్రికలు, ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పత్రికలు ఉన్నప్పటికీ “ఆనాడు” మరికొన్ని పత్రికల ఏర్పాటుకు స్థానం ఉందని గమనించిన ఒక పెద్ద మనిషి ఒక వార్త పత్రికను ప్రారంభించడం జరిగింది. అప్పటి ఆ సమయంలో కొత్త పార్టీ ప్రారంభోత్సవం దానికి సదరు పత్రిక అత్యంత ప్రాచుర్యం కల్పించింది అని దానికి కారణం పత్రిక యాజమాన్యం మరియు పార్టీ వ్యవస్థాపకులు ఒకే సామాజిక వర్గం కావడం ఒక కారణంగా చెప్పుకుంటారు కొందరు. అలాంటి తరుణంలో అప్రతిహతంగా గెలిచిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం అనేక సంక్షోభాలు, పరిస్థితుల నడుమ కొంత ఆ పత్రిక ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ అంతర్గత కల్లోలం పార్టీ అధ్యక్షుడి వ్యతిరేక వర్గానికి మద్దతుగా నిలిచి కార్టూన్ల రూపంలో కించపరుస్తూ కథనాల రూపంలో ప్రచురణ సాగింది అని కొందరు చెప్పుకుంటూ ఉంటారు. అనంతరం వ్యతిరేక వర్గం పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం సదరు పత్రిక మరియు యాజమాన్యం అనేక రూపాల్లో లబ్ధి పొందింది అని వినికిడి. ఇలా ప్రభుత్వాన్ని భుజాన వేసుకుని అనుకూల కథనాలు ఆనాడే ప్రారంభం అయ్యి పత్రికల స్థాయిలో భజన ఇలా ఉన్న తరుణంలో కొత్త శతాబ్దంలో నిరంతర వార్త ప్రసార ఛానెళ్లు ప్రారంభం అయ్యాయి. వాటి సంగతి ఎలా ఉందో ఒకసారి చూసి ఇప్పటి పరిస్థితులు మరియు అమరావతి పై మీడియా కథనాలు ఒకసారి చూద్దాం.

కొత్త శతాబ్దంలో నిరంతర వార్తలు ప్రసారానికి ఛానళ్ళు ప్రారంభమైన కొత్తలో చాలా వరకు ప్రజలకు ఉపయోగపడే వార్తలు ప్రసారం అవుతూ అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న తరుణంలో ఒక్కసారిగా పుట్టగొడుగుల్లా వార్త ఛానళ్ళ మధ్య పోటీ ప్రారంభం ఎక్కువయింది. ఇది గమనించిన ప్రభుత్వంలో ఉన్న పార్టీలు చాలా వరకు అనేక రూపాలలో వాటిని తమ చేతుల్లోకి తీసుకుని ప్రభుత్వ అనుకూలంగా వార్తలు ప్రసారం అయ్యేలా చూసుకున్నారు.


గత 15 సంవత్సరాలుగా రాజకీయాలలో మీడియా ప్రమేయం లేక మీడియాలో రాజకీయ ప్రమేయం మరింత ఎక్కువైందని ప్రతి సామాన్యుడికి కూడా అర్థమయ్యింది, అది ఎంత మేరా జరిగిందో ఒక్కసారి మనం చరిత్ర పేజీలను వెనక్కి తిప్పి చూస్తే…..

2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర వల్ల కానీ స్వతహాగా అప్పటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఐతే అప్పటి ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ రాజశేఖరరెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తునాయి ఆ రెండు పత్రికలు, ఆ రెండు పత్రికలు అంటూ కొన్ని వార్త పత్రికలను గురించి ఎప్పుడు ఉటంకిస్తూ ఉండేవారు. అనంతరం వారి తనయుడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేత వేరొక వార్తా పత్రిక మరియు ఛానెల్ కి శ్రీకారం చుట్టారు. ఏది ఎలా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు అంత ఎక్కువగా వెళ్లకుండా ఉంటాయి అని పత్రికలు వార్తా చాన్నెళ్ళ ఆదాయ వనరుగా ఉన్న ప్రభుత్వ ప్రకటనలు వీలున్నంత వరకు సమానంగా ఇచ్చేవారు అని, వారు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్దగా మాట్లాడుకున్న ఎన్నికల ప్రారంభ సమయానికి తమని నమ్మిన పార్టీని భుజాన వేసుకుని మర్లా ప్రచారం కల్పించేవారు అని కొందరు విశ్లేషకులు కూడా అభివర్ణిస్తుంటారు.


అనంతరం రాష్ట్ర విభజనలో మీడియా పోషించిన పాత్ర గురించి మరెప్పుడన్న చర్చించుకుందా. ఒకసారి రాష్ట్ర విభజన అనంతరం నుండి మొదలుకుని ఇప్పటవరకూ జరిగిన పరిణామాలను మీడియా చిత్రీకరించిన విధానాన్ని ఒక్కసారి మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం.


2014 రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో మీడియా ఎన్నికల పూర్వము ఎన్నికల అనంతరం కూడా తమ తమ పక్షాలను నిర్ణయించుకుని పూర్తిగా ఆయా పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం మనందరికీ విదితమే. ఒక్కసారి కొన్ని అంశాలను తరచి చూసే ప్రయత్నం చేద్దాం.

2014 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కి అనుకూలంగా ఉన్న పత్రికలు మరియు వార్తా ప్రసార ఛానళ్ళు ఒక్కసారిగా ఊపిరి పోసుకున్నాయా అన్నట్టుగా ప్రవర్తన సాగిందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదేమో అన్నట్టుగా కథనాలు వడ్డించడం ప్రారంభించాయి. మచ్చుకకు కొన్ని స్పృశించే ప్రయత్నం చేద్దాం.


రాష్ట్ర విభజన అనంతరం విడిపోయిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10యేళ్లు ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బ్రీఫ్డ్ మీ వివాదం ఎంత దుమారం రేపిందో అనంతరం ఉన్నపళంగా హైదరాబాద్ ను విడిచి రాజధానిని విజయవాడ ప్రాంతంలో ఒక రకంగా ముఖ్యమంత్రి బస్ లో ఉండి పరిపాలన సాగించవలసి వచ్చిందని ఎందరో ఇప్పటికీ చర్చల్లో ఉటంకిస్తూ ఉంటారు. దీనిని కవర్ చేయడానికి సదరు అనుకూల మీడియా అల్లిన కథ కట్టు బట్టలతో విచేసం, రాజధాని కూడా లేకుండా బస్ లో ఉండి పరిపాలన చేసిన ఘనులు శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఇప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా ఉద్ఘాటిస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి ఆయా గ్రామాల్లో భూసేకరణ జరిపే సమయంలో కొన్ని ఆ ప్రాంతానికి మించిన అద్భుత ప్రాంతం మరెక్కడా రాష్ట్రంలో లేదు అన్నట్టుగా కథనాలు, చర్చలు సాగించి, వ్యతిరేకించిన లేక ఏదన్నా సద్విమర్శ/ఆధార సహిత విమర్శలు చేసిన వారిపై కూడా తిట్ల దండకాన్ని లకించిన నాయకుల ప్రెస్స్ మీట్లు నిరంతర అంతరాయం లేని ప్రసారాలతో మోత మోగించిన సందర్భాలు లెక్కకు మించినవే.


రాష్ట్ర రాజధాని అమరావతి అని నిర్ణయించిన అనంతరం రాజధానిని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు ఏ నగరంలోకి ప్రపంచంలో ఏ నగరానికి వెళ్తే ఆ నగరానికి దీటుగా నిర్మాణం చేపడతాం అని దానికి సింగపూర్ కన్సర్షియం తో ఒప్పందం చేసుకున్నాం అని ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మాణం కోసం అనేక డిజైన్లు వాటికి కల్పించిన ప్రచారం కేవలం ప్రచారానికి మిగిపోయింది. ఇది సరైన పద్ధతి కాదు అనడమే పాపంగా ఏ ఒక్కరినీ విడవకుండా అన్న మాట మళ్ళా అనకుండా అధికార పార్టీ ప్రతినిధులు పెట్టిన మీడియా సమావేశాలకు అందించిన ప్రాముఖ్యత మనందరికీ విదితమే.


ఎన్నికల హామీలు నీటి మూటలుగా మిగిపోయాయి. వాటిపైకి ప్రజల దృష్టి మరాలకుండ చేసిన సదరు మీడియా ప్రయత్నం గర్హనీయం. ఇక రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువలా వస్తుందని తద్వారా రాష్ట్రంలో వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అని ఆ ఉద్యోగాలలో ఉద్యోగం సాధించలేనివాడే దురదృష్టవంతుడు అన్న చందంగా పలికిన పలుకులు గురించి ఏమని చెప్పగలం. ఇక దావొస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో అప్పటి పరిశ్రమలు, ఐటీ పంచాయితీరాజ్ శాఖా అమాత్యులు శ్రీ నారా లోకేష్ గారి పని తీరు, నైపుణ్యతకు, ఆతిథ్యానికి ముగ్ధులైన ప్రపంచ వ్యాపారవేత్తలు ఒక్కసారిగా వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడినట్టుగా పలికిన పలుకులు ఐతే వర్ణనకు సాధ్యం కానిది.


ఇలా ఉదహరించుకుంటూ పోతే ఒక గ్రంధం ఐనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదేమో. ఇక జనసేన మద్దతుతో టీడీపీ బీజేపీ పొత్తుతో అధికారంలోకి వచ్చిన మొదట్లో పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ పార్టీకి కానీ తమ ఛానెల్స్ లో కల్పించిన ప్రచారం ఏపాటిదో అనంతరం టీడీపీ చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిన పవన్ కళ్యాణ్ గారికి ఆ తరువాత వారి వార్తలలో చిత్రీకరించిన తీరు, వారు చేసిన సద్విమర్శలకు కల్పించిన ప్రచారం ఏపాటిదో మరొక్కమారు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తమ భావాలు ఎలా ఉన్న జర్నలిస్ట్ అని చెప్పుకునే మీడియా యాజమాన్యం ప్రజలకు నిస్పక్ష వార్త కథనాలు ఎక్కువగా(పూర్తిగా అందించాలి అనుకోవడం అత్యాశ అవుతుందేమో) అందించాల్సింది పోయి కేవలం తాము భుజాన వేసుకున్న వారు మాత్రమే ఘనులు మిగిన వారు కాదు అన్న రీతిలో సాగిన తీరు 2014 తరువాత అధికంగా ఒక రకంగా ప్రథమంగా సాగింది అని చెప్పుకోవచ్చు.


2019 ఎన్నికల సమయం మరియు ఎన్నికల అనంతరం వీరు చేసిన హడావిడి గురించి చర్చించాలి అని ఉన్న ఇప్పటికే లెంగ్త్ ఎక్కువైంది అందరికీ తెలిసిన విషయం కనుక దాని గురించి మాట్లాడకుండా రాజధాని అంశంపై ఇవే మీడియా ఛానళ్ళు పత్రికల గురించి గమనిద్దాం. డిసెంబర్ 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మార్పు గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసింది మొదలు ఒక్కసారిగా వీరి కథనాల శైలి మారిపోయింది అంతకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయలేదు అన్నటువంటి ఇవే ఛానళ్ళు ఇప్పుడు దానికి భిన్నంగా కథనాలు చర్చలు ప్రారంభించాయి, అంతకు ముందు ఏది చేసిన రాష్ట్ర హక్కు కేంద్రానికి జోక్యం చేసుకునే అధికారం లేదు అన్న వీరే ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోవాలి అనే వాదనను తెరలేపారు. రాష్ట్ర హక్కులను కేంద్రం కలరస్తుంది అన్న ఇవే ఛానెళ్లు ఇప్పుడు అవకాశం లేకున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మళ్ళా మోసం చేసింది, చేస్తుంది అన్న చందాన వార్తా కథనాలు వండి వార్చడం, పలుకులలో పలకడం మనం గమనిస్తూనే ఉన్నం.ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఆర్థికంగా గడిన పడి మళ్ళా పుంజుకోవడం గురించి, రాష్ట్రంలో అభివృధి లేకుండా సంక్షేమం పై మాత్రమే దృష్టి పెడుతున్న ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితుల ఎంత గడ్డుగా ఉండబోతున్నాయి అనే దాని గురించి కానీ, అనేక ఇతర సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం రాష్ట్రంలో మరే అంశం లేనట్టుగా ఇది మాత్రమే అంశంగా అంతకు ముందు ఎన్నికల కమిషనర్ నియామకం గురించి సాగిన కథనాలు, ఇప్పుడు అమరావతి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్కరూ కూడా వొద్దు అవసరం లేదు అని ఎవరు అనారు కానీ దానికంటూ ఒక పరిమితులు కూడా ఉన్నాయి కదా, మరే సమస్య లేనట్టు ఇది మాత్రమే సమస్య అన్నట్టు దాని చుట్టూ మాత్రమే తిరుగుతూ తాము నమ్మిన పార్టీకి మేలు చేస్తున్నాం అనుకుని మరింత కీడు చేస్తున్నాయి ఏమో ఆలోచించుకోవాలి. ఒక పాఠకుడిగా రాష్ట్ర పౌరునిగా నా రాష్ట్రంలో జరిగే అంశాలపై జరిగే వాటి నిస్పక్షపాతమైన అసలైన వార్తలు కోరుకోవడం నా హక్కు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నాకున్న అవకాశం ఎంటి అని ఆలోచిస్తే నాకు దొరికిన సమాధానం, ఇప్పటికీ మన రాష్ట్రంలో మీడియా పూర్తిగా పార్టీలను భుజాన వేసుకున్న తరుణంలో వొచ్చే వార్తలలో మరింత సూక్ష్మంగా వార్తలను గమనించడం తప్ప ఇప్పటికీ మరొక ఆలోచన తట్టడం లేదు. మీ దగ్గర ఏదైనా మరొక మంచి సలహా ఉంటే అందించాలి అని కోరుకుంటున్నాను

224 views1 comment

Recent Posts

See All

1件のコメント


Alp Kumar
Alp Kumar
2020年8月22日

Nice article bro

いいね!
bottom of page