“తొలిగండం దాటితే తొంభై ఏళ్ళు" అని ఒక సామెత ఉంది.మన రాజకీయ పార్టీలు కూడా ఇదే సామెతని ఆచరిస్తున్నాయి.ఐదేళ్ల ఎన్నికల గండాన్ని గట్టెక్కడానికి, గద్దెనెక్కడానికి తాత్కాలిక తాయిలాలు ఆశ చూపి ధీర్ఘ కాలిక ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.సమూల సంస్కరణలు తీసుకురావడం పట్ల పూర్తి నిర్లిప్తత వహిస్తున్నారు.
ఎన్నికల ముందు హామీల వరాల జల్లు గుప్పిస్తూ ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికామాటలాడి అన్నట్లు ప్రజల బలహీనతలను ఆసరాగా తీసుకొని తాత్కాలిక నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారే తప్ప భవిష్యత్ కోసం,రాబోయే తరాల కోసం,సమాజ అభివృద్ది కోసం సంస్కరణల కోసం ధీర్ఘ కాలిక లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంది లేదు కదా వాటికోసం కనీసం ఆలోచన చేసింది కూడా లేదు.
ప్రభుత్వాలు ప్రజల జీవన విధానాన్ని మెరుగు పరిచే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలి. రాబోయే తరాలకి బంగారు భవితని అందించే దిశగా కార్యాచరణ రూపొందించాలి.ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అనేకానేక అసమానతలు భవిష్యత్ తరాలకి ఉండకుండా చూడాలి. పేదరికం,అవిద్య,అనారోగ్యం,వంటి సమస్యలకి శాశ్వత పరిష్కార మార్గాలు కనుక్కొని వాటి అమలుకి కృషి చేయాలి.కానీ మన దౌర్భాగ్యం,మన రాజకీయ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉంది అంటే ప్రజలని సమస్యల నుండి విముక్తులని చేస్తే మళ్ళీ ఎన్నికల్లో నెగ్గడానికి మరో కారణం దొరకదు కాబట్టి సమస్య ఎంత కాలం ఉంటే అంత మంచిది,దాని ద్వారా పదవులెక్కి లబ్ది పొందుదాం అని ఆలోచించే దుస్థితిలో ఉంది మన రాజకీయ వ్యవస్థ.
ప్రజలను స్వంతంత్రులుగా ఎదగనిచ్చే అవకాశం కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వాలది కానీ.ఆ ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధిని చూసుకుంటూ తమ భాద్యతని విస్మరిస్తున్నాయి. ప్రజలు ప్రభుత్వాల మీద ఆధార పడేలా చేస్తున్నాయి,ఒక రకంగా వారిని బలహీన పరిచే విధానాలు అవలంభిస్తున్నాయి.తాత్కాలిక తాయిలాలు ఎరచూపో,లేక ఆకర్షక పధకాలతోనో ప్రజల్ని ఏమారుస్తూ వస్తున్నాయి.వారి పేదరికం, అవిద్య,అవగాహనా రాహిత్యాన్ని రాజకీయ స్వప్రయోజనాలకి వాడుకుంటున్నాయి.తమకి తరాల పాటు విధేయంగా ఉండే ఓటు బ్యాంకును సృష్టించుకుంటున్నాయి,ఇక్కడ మాత్రమే దూర దృష్ఠీ,ముందు చూపు ఉన్నాయే కానీ,ఇప్పుడు అవలంభిస్తున్న విధానాలు,పధకాల వల్ల భవిష్యత్లో ఎదుర్కొబోయే సవాళ్ళ గురించి మాత్రం ఆలోచన లేదు.
అధికారంలోకి వచ్చే వాళ్ళూ,,అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే తపన తాపత్రయం తప్ప చిత్తశుద్దితో రాబోయే తరాల కోసం ఆలోచన చేద్దాము,ధీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందిద్దాము అని లేదు.
ప్రభుత్వానికి ఉండాల్సిన ప్రాధాన్యతలు .
.ప్రజలకి కనీస మౌలిక సదుపాయాల కల్పన -
- విద్య,విద్యా ప్రమాణాలు పెంచడం,నాణ్యమైన విద్యని అందించడం
- ఆరోగ్యం,పౌరలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు కల్పించడం
- ఉపాధి,యువతని ప్రయోజకులుగా తీర్చి దిద్ది,ఉపాధి కల్పించి,మానవ వనరులని సరైన దోవలో వినియోగించుకుంటూ తద్వారా సంపదని సృష్టించడం
- అభివృద్ది వికేంద్రీకరణ చేయడం
- చట్ట బద్ద పాలన అందించడం
ఇవీ ఏ ప్రభుత్వాలకి అయినా ఉండాల్సిన ప్రాధామ్యాలు
కానీ మన ప్రభుత్వాలు మాత్రం వీటిపై దృష్టి పెట్టవు,పెట్టినా అందునుండి వాళ్ళకి ఒనగూరే ప్రయోజనాలు,ఓట్లు ఆశించే వాటిని రూపొందిస్తారు. డెబ్బై ఏళ్ల స్వాతంత్రం తరువాత కూడా ఇంకా ప్రజలు ఆసుపత్రికి వెళ్లడానికి నానాయాతన పడుతున్నారు, ఆకలి చావులు,అవిద్యా అలానే ఉన్నాయి.ఎన్నడూ లేనంత స్థాయికి నిరుద్యోగం పెరిగిపోయింది. ఇప్పటి తరం పేదరికంలో ఉంటే వారి జీవన విధానాన్ని మెరుగు పరిచి భవిష్యత్ పట్ల వారికో ఆశ కలిగించే దిశగా ప్రభుత్వాలు చేపట్టే చర్యలు శూన్యం. వారి పేదరికాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకునే పనిలోనే నిమగ్నమై ఉన్నాయి రాజకీయ పార్టీలన్నీ.నిరుద్యోగులకి భృతి కల్పిస్తాం అని ఎన్నికల హామీలు ఇస్తున్నారు అంటేనే అర్దం అవుతుంది ఎంత విపరీత రాజకీయాల్ని చూస్తున్నామో . ఉద్యోగ ఉపాధి కల్పన చేస్తాం.యువతకి బంగారు భవితని అందిస్తాం,స్వశక్తితో సొంత కాళ్ళ మీద నిలబడేలా చేస్తాం,భవిష్యత్ తరాలకి నిరుద్యోగ సమస్య ఉండకుండా విద్యా విధానంలో మార్పులు తీసుకోస్తాం,వృత్తి నైపుణ్యం పెంచుతాము,తగిన శిక్షణ ఇప్పించి ఉద్యోగార్ధులుగానే కాక,ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీర్చి దిద్దుతామ్ అని చెప్పే రాజకీయ పార్టీలు ఎన్ని??
ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే కదా. వీటిపై చర్చలకి తావివ్వకుండా ప్రజల ఆలోచనల్ని ఎప్పటికప్పుడు పక్క దారి పట్టించే అనవసర రాద్ధాంతాల మీద దృష్టి పెడుతాయి. ఫక్తు రాజకీయ పార్టీల్లానే వ్యవహరిస్తున్నాయి తప్ప, భాద్యతయుత వ్యవస్థలుగా మాత్రం ఉండట్లేదు .
ఎప్పుడూ ఏదో అనిశ్చితిలోకి ప్రజలను నెట్టి వారికి జరగాల్సిన అభివృద్ది జరుగుతుందా లేదా అని ఆలోచనే రాకుండా చేస్తున్నాయి రాజకీయ పార్టీలు
ప్రజలు చైతన్య వంతులుగా మారాల్సిన అవసరం ఉంది.రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల భవితని ఎలా ప్రశ్నార్ధకం చేస్తున్నాయో తెల్సుకోవాలిల్సిన అవసరం ఉంది.ఆ భాద్యత యువత పై ఎక్కువగా ఉంది.
మన భవితకి మనమే భాద్యులం - మన సమాజ గతికి ప్రగతికి మనమే ఆద్యులం.
ความคิดเห็น