నా జనసైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు,అవినీతి వ్యవస్థని ముంచేసే ఉదృత జలపాతాలు నా జనసైనికులు,దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే కొదమ సింహాలు నా జనసైనికులు,నా జనసైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు,తల్లి భారతమాతకి ముద్దు బిడ్డలు నా జనసైనికులు.....
నాకు న్యూస్ పేపర్లు లేవూ,న్యూస్ ఛానళ్ళు లేవు,అభిమానులున్నారు…….
నన్ను నా ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని సంధార్భాల్లో అర్దం చేసుకోలేదు,కానీ నా అభిమానులు నన్ను అర్ధం చేస్కున్నారు....
నేను తీవ్ర నైరాశ్యంలో ఉన్నప్పుడూ,ఓటమిలో కూరుకుపోయినపుడు నాకు బలంగా ఉంది, ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చింది నా అభిమానులే.....
నా జనసైనికులే నా న్యూస్ పేపర్లు,వాళ్ళే నా ప్రసార సాధానాలు .....
పలు సంధార్భాలలో జనసైనికులని,అభిమానులని ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.ఇవి కేవలం నోటి నుండి వచ్చిన మాటలు కాదు,మనసులో జనసైనికుల మీద ఆయనకున్న నమ్మకం.కానీ ఆ నమ్మకాన్ని మనం,జనసైనికులమ్ ఎంతవరకూ నిలబెట్టుకున్నాం అనేదే ప్రశ్న.
మనం కోరుకున్న మార్పు జరగాలి అంటే అధికారం అనే సాధనం తోడైతే ఇంకాస్త ఊతం లభించినట్లుగా ఉండేది.అలాంటి అధికారం దక్కాలి అంటే కేవలం అభిమానులే ఓటు వేస్తే సరిపోదు,సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ ఓటు వేయాలి.మొదట అసలు జనసేన గురించి సామాన్యులకీ,మేధావి వర్గానికి ఉండే అభిప్రాయం ఏమిటో చూద్దాం. సమాజంలో ఇక మార్పు రాదేమో,ఇవే అవకాశవాద పార్టీలే ఒకరి తరువాత ఒకరు గద్దెనెక్కుతారు,ఆటగాళ్లు మారుతారే తప్ప,ఆట నియమాలు మారవు అని ఒక నిర్ణయానికి వచ్చేశాడు సామాన్యుడు.అలాంటి సామాన్యుడికి ఒక ఆశాకిరణంలా విలువలు, భావజాలం, ఆశయాలే అస్త్రాలుగా సమాజంలో మార్పే లక్ష్యంగా నిస్వార్ధ రాజకీయం చేయడానికి జనసేన ఆవిర్భవించింది.
సమాజం,రాజకీయం ఇక మారవు అని నిర్ధారించుకొని నిస్వార్ధ రాజకీయం,ఆశయాలతో ముందుకు సాగే రాజకీయం అనేది కేవలం పుస్తకాల్లోనే ఉంటాయి అనుకునే మేధావి వర్గానికి,ఆశయాలతో సిద్దాంత బలంతో ముందుకు వెళుతూ వారు అసాధ్యం అనుకున్న రాజకీయ ప్రక్షాళన సుసాధ్యమే అని రుజువు చేసేందుకు జనసేన ఆవిర్భవించింది.
ఇలా రాగానే అలా మనవైపు వచ్చేయలేరు సామాన్యుడు అయినా,మేధావి వర్గం ఐనా, ఎందుకంటే డెబ్బై ఏళ్లుగా ప్రజలు విసిగిపోయి ఉన్నారు రాజకీయ నాయకుల వికృత క్రీడ వల్ల,మనం వారందరి కంటే భిన్నమైన వాళ్ళం,మన మాటలూ,మన చేతలూ ఒకటే,సిద్దాంతమే మన బలం ,రాజకీయ ప్రక్షాలనే మన లక్ష్యం ,సమాజంలో మార్పే మన ధ్యేయం అని వారందరికీ అర్ధం అవ్వాలి.అపుడే వారు జనసేన పక్షాన నిలుస్తారు.అప్పటి వరకూ మనల్ని సునిశితంగా గమనిస్తూనే ఉంటారు,ఎక్కడైనా తప్పులు దొర్లుతాయా అని,ఏవైనా పొరపాట్లు జరుగుతాయా వేలెత్తి చూపుదాము అని.ఉన్నత ఆశయాలతో వచ్చిన వారు ప్రతీ చోటా,ప్రతీ అడుగులోనూ ఖచ్చితత్వం పాటించాలని కోరుకుంటారు,చిన్న తప్పిదమైనా చాలా తీవ్రమైనదిలా కనిపిస్తుంది వారికి.అలాంటి వారిని మన వైపు వచ్చేలా చేయాలి అంటే సేనాని మాటలు,ప్రసంగాలు,వారికి చేరాలి.సేనాని భావజాలం అర్దం అవ్వాలి.
కానీ
అభిమానులుగా,జనసైనికులుగా సేనానికీ ప్రజలకీ మధ్య వారధిలా ఉండాల్సిన మనమే వీరిరువురి మధ్య దూరాన్ని పెంచుతున్నాము.కఠినంగా ఉన్నా ఇది నిజం.సభల్లో,జనసేనానిని చూసిన ఆనందంలో,భావోద్వేగంలో,ఉత్సాహంతో మనం చేసే కేరింతలు,అరిచే అరుపులు,కొట్టే చప్పట్లు సేనానికీ,ప్రజలకీ చికాకునే కలిగిస్తున్నాయి
మన అత్యుత్సాహం వల్ల చెప్పాల్సిన విషయం సరిగా చెప్పనివ్వకుండా సేనానికి అడ్డుపడుతున్నాం,ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తున్నాం.దీనివల్ల తాను చెప్పాలనుకున్నది, వివరించాలనుకున్నది పూర్తిగా చెప్పలేకపోతున్నారు సేనాని.ఇది అనేక సభల్లో జరిగినదే.ఉపన్యాసంలో చాలా సమయం అభిమాన గణాన్ని నియంత్రించేందుకే వృధా అవుతుంది. దీనివల్ల ప్రజలకి చేరాల్సిన సందేశం చేరట్లేదు.పైపెచ్చు అపార్ధం చేసుకుంటున్నారు.
అదే మనం ఆటంకం కలిగించకుండా ఉండి ఉంటే,తాను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే అవకాశం దక్కేది సేనానికి,స్థానిక సమస్యల ప్రస్తావన,పరిష్కార మార్గాల వివరణ జరిగేది. జనసేన ఏ విధంగా ప్రజలకి బాసటగా నిలుస్తుందో సుస్పష్టంగా తెలియజెప్పేవారు.ప్రజలకి కూడా పవన్ కళ్యాణ్ భావజాలం అర్దం అయ్యేది,మన విధానాలు ఎలాంటి వక్రీకరణలు లేకుండా నేరుగా ప్రజలకే తెలిసేవి.వారు మనపై భరోసా ఉంచేందుకు ఇవి తోడ్పడేవి.
కానీ ఇది జరగకుండా అడ్డుకుంది మనమే,మన అభిమానమే.ఎన్నికల ముందు రోజు, మందు బిర్యాని ఇచ్చో, డబ్బు పంచో ఒట్టు వేయించుకొని ఓట్లు కొనుక్కునే పార్టీ కాదు మనది.మనకి ఓటు పడాలి అంటే అది స్వచ్ఛందంగా పడాల్సిందే.అలా జరగాలి అంటే సేనాని మాట్లాడే ప్రతీ మాట, ప్రజలకి చేరాల్సిందే.ఐదేళ్ల పాటు సేనాని ఉపన్యాసాలు విని,ఆ కార్యాచరణ చూసి అపుడే ఓటు వేస్తారు ప్రజలు.ఇలా పదే పదే సేనాని ప్రసంగానికి అడ్డు పడుతుంటే,ఇక జనసేన సభలు అంటే ఎప్పుడూ ఒకటే అభిమానుల అరుపులే ఉంటాయి అని ఒక నమ్మకం ఏర్పడిపోతుంది. దానివల్ల నష్టం మనకే.
మనల్ని పవన్ కల్యాణ్ గారు జనసైనికులు అని ఎందుకు ఉటంకిస్తారో తెలుసా,సైనికుల వలె క్రమశిక్షణతో ఉండాలి అని.ఆయన్ని సేనానిగా మనం భావించినపుడు,ఆయన మనల్ని జనసైనికులుగా స్వీకరించాలి అంటే మనం క్రమశిక్షణతో మెలగాలి కదా.
ఇక సామాజిక మాధ్యమాలలో జనసైనికుల అత్యుత్సాహం గురించి చర్చిద్దాం
సోషల్ మీడియా మన బలం.వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జనసేన సిద్దంతాలను, ఆశయాలను,జనసేన భావజాల వ్యాప్తికి జనసైనికులుగా మనమందరం కృషి చేశాము, చేస్తున్నాము.కానీ ఎన్నికల ముందు ఆ తరువాత జరిగిన,జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఈ మధ్య జరిగిన అంతర్గత సమావేశాల్లో సేనాని కూడా జనసైనికుల అత్యుత్సాహం గురించి, అనవసర ఆవేశాల గురించి ప్రస్తావించారు.మనం బలంగా భావించిన సోషల్ మీడియాని ఎలా బలహీనతగా మారుస్తున్నామో వివరించారు.
ఏ పార్టీ కార్యకర్తకి అయినా క్రమశిక్షణ,సంయమనం,భాద్యతాయుతంగా వ్యవహరించడం, సహనం,అధినాయకుడి మీద పూర్తి విశ్వాసం,నాయకుడి నిర్ణయాల పట్ల గౌరవం,పార్టీ పట్ల నమ్మకం అనేవి అత్యంత ఆవశ్యకం.కానీ అధినేత నిర్ణయాలను బాహాటంగా,బహిరంగంగా విమర్శించడం,పార్టీ విధానాలను ఎదురించడం వంటివి చేయడం మనకే చెల్లింది.సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి నుండి సేనాని ఏం చేయాలి,ఏది చేయకూడదు,ఏం మాట్లాడాలి, ఎలాంటి వేషధారణ కలిగి ఉండాలి,ఎక్కడికి వెళ్ళాలి,ఎక్కడికి వెళ్లకూడదు అని ఆదేశాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నాం.బహుశా ఊహించని ఓటమి ఎదురవడం వల్ల కలిగిన భావావేశం అయ్యుండొచ్చు, లేక ఆ ఓటమి తాలూకా గాయాన్ని మరిచిపోవడానికి ఆ నైరాశ్యం నుండి బయటకి రావడానికీ, మనసులో ఉన్న ఆవేదన అలా బయటకి వచ్చి ఉండవచ్చు.కానీ అది జనసైనికులుగా మనం చేయదగినది కాదు.
ఒక రంగంలో అత్యున్నత శిఖర స్థాయికి చేరుకున్న వ్యక్తి ఆ స్థానాన్ని తృణ ప్రాయంగా త్యజించి, రేపటి తరాల భవిత కోసం తన భవిష్యత్తుని పణంగా పెట్టి,ఒక సుధీర్గ ప్రయాణం చేయడానికి, అదీ ముళ్ళ బాటలో నడవడానికి సన్నద్ధం అయిన వ్యక్తికి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు చేయాలో తెలియదా,ఆ మాత్రం ఆలోచన, అవగాహన లేకుండా నిర్ణయం తీసుకుంటాడా?కొన్ని దశబ్ధాలుగా సమాజాన్ని చదివి అర్ధం చేసుకున్న వ్యక్తికీ ,రాజకీయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్న వ్యక్తికి,ఓటములే సోఫానాలుగా చేసుకొని పైపైకి ఎదిగే వ్యక్తికి సలహాలూ, సూచనలూ, ఆదేశాలు, ఉపదేశాలూ ఇచ్చే స్థాయా మనది?
ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సంధర్భం ఇది.
ప్రచార సాధానాలుగా,ప్రసార సాధనాలుగా,ఉండాల్సిన మనమే శల్య సారధ్యం వహించడం ఎంతవరకు సబబు?
జనసేన గళం జనసైనికులు, జనసేన బలం జనసైనికులు.అలాంటి బలం బలహీనతగా మారకూడదు.
పార్టీ అంతర్గత విషయాలు బహిరంగంగా చర్చించడం సరికాదు.నిజంగా సరిచేసుకోవాల్సిన పొరపాట్లు,సవరించుకోవాల్సిన లోటుపాట్లు ఉండే ఉంటాయి.మన అభ్యంతరాలను, అభిప్రాయాలను పంచుకునే అంతర్గత వేదికలు ఉన్నాయి ,వాటి ద్వారా వ్యక్తపరచాలి కానీ నలుగురిలో నవ్వుల పాలు చేయడం సరికాదు.ఇలా ఒకరు చేయడం మొదలు పెడితే ఒకరిని చూసి ఒకరు వారిని చూసి మరొకరు అదే బాటలో నడుస్తున్నాం ,సామాజిక మాధ్యమాలలో అనవసర చర్చలకి తెర లేపిన వాళ్ళం అవుతున్నాం .స్వీయ నియంత్రణ అనేది అలవరచుకోవాలి. విచక్షణ అనివార్యం ఇప్పుడున్న పరిస్థితులలో.పది మందిలో ఇంటి గుట్టు రట్టు చేయడం తగదు.అలా చేయడం జనసైనికుల లక్షణం కాదు.
ఎన్నికల క్షేత్రంలో ఊహించని పరాభవం ఎదురైంది.పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొబోతుంది. అత్యంత క్లిష్ట సమయం ఇది,సేనాని తరుచుగా ప్రస్తావించే శేషేంద్ర శర్మ కవితలోని పంక్తులైన “ ఇల్లేమో దూరం ,అసలే చీకటి,దారంతా గతుకులు,చేతిలో దీపం లేదు”అన్నట్లుగా ఉంది పరిస్థితి.ఇంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా ఒక వ్యక్తి రేపటి తరానికి ఉజ్వల భవిత అందించాలని బలంగా కోరుకుంటున్నాడు.సమూల రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేయాలని సంకల్పించుకున్నాడు,గుండెల నిండా ధైర్యం నింపుకొని సేనాని ముందుకు సాగుతున్నాడు సవాళ్ళనీ,సమస్యలనీ దాటుకుంటూ....
ఇలాంటి సమయంలో వివేకం,విచక్షణ,క్రమశిక్షణ,సంయమనం,సహనంతో ఆ వ్యక్తికి బాసటగా నిలిచి శక్తిని ఇద్దామా?? లేక భాద్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తూ సేనాని మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేద్దామా??
అభిమానుల నుండి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పరివర్తన చెందడమే సేనానికి మనమిచ్చే ఘనమైన పుట్టిన రోజు బహుమతి.
Comments