top of page
Writer's pictureSainika Swaram

వైసీపీ ఏడాది పాలనపై సైనిక స్వరం విశ్లేషణ


సరిగ్గా సంవత్సరం క్రితం "ప్రజా సంక్షేమం" అనే పేరుతో ,తిరిగి "రాజన్న రాజ్యం" తెద్దాం అనే మాటలతో గద్దెనెక్కింది ఓ ప్రభుత్వం!

ప్రజా సంక్షేమం పక్కన పెట్టి ప్రజాస్వామ్యం,పరిపాలన,రాజ్యాంగ విలువలు గురించి కాసేపు చర్చిద్దాం!

ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం దగ్గర నుంచి రాజ్యాంగ,స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలని నీరుగార్చడం వరకూ చూసాం!




రాజ్యాంగ వ్యవస్థకి తూట్లు -


పెద్దల సభ (మండలి) ఉన్నది ప్రజాప్రతినిధులు ఏవైనా చట్టం లో లోటుపాట్లు ఉంటే దానిని పరీక్షించి, దానికి ఏఏ మార్పులు చేస్తే బావుంటుందో "సూచన ప్రాయంగా" ఇచ్చే భాధ్యత రాజ్యాంగం మండలికి కల్పించింది! మండలి ఉండాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. వైసీపి ప్రభుత్వం తాను చేసిందే వేదం అన్న చందంగా,ఏకపక్షంగా 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారనెమో కానీ అమరావతి విషయం లో తీసుకున్న నిర్ణయాల మీద మండలి సూచించిన సలహాలు కానీ "సెలక్ట్ కమిటీకి" పంపడం కానీ ఓర్వలేని ప్రభుత్వం ఏకంగా "మండలి రద్దుకే" పూనుకుంది!

ప్రజాస్వామిక వ్యవస్థలో "చర్చల" ద్వారా నే ఒక సమస్య పరిష్కారం కనుగొనాలి!

ఆ చర్చలు అర్థవంతంగా ఉండాలి. మండలి లో కానీ బయట కానీ చర్చ జరిగి ఉండి ఉంటే ,అసలు ప్రభుత్వానికి చర్చలు జరిపే ఉద్దేశమే ఉంటే మండలి రద్దు తీర్మాణం వరకు వచ్చేది కాదు.

ఇక్కడ ఒక వర్గం మీదనున్న కోపంతోనో లేక ఆ వర్గం నాయకుల మీద ఉన్న ద్వేషం తోనో ఈనాడు రాజధాని ప్రాంతంలో వాళ్లకి మేలు కలిగేలా గత ప్రభుత్వం సహకరించింది, అవినీతి అక్రమాలు జరిగాయ్ అనే ఆరోపణతో "రాజధానిని తరలిస్తాం" అని చెప్పి వేల మంది రైతుల పొట్టకొట్టిన ప్రభుత్వం వారితో అసలు చర్చలు జరిపారో లేదో కూడా సంశయమే! ఒక కమిటీ వేసి దానిని కేవలం పేరుకే అడ్డం పెట్టుకుని మీ కోరికమేరకు రిపోర్టు తయారు చేయించుకోన్నారన్న ఆరోపణని సైతం తిప్పికొట్టలేదు వైసిపి ప్రభుత్వం!!

రాజధాని బిల్లుని అడ్డుకున్నారని ఏకంగా రద్దు చేసే వరకు వెళ్లడం "రాజ్యాంగ వ్యవస్థలని తుంగలో తొక్కడమే".

మమ్మల్ని ప్రజలు గెలిపించారు మేం ఏం చేస్తే అదే వేదం అనే అత్యుత్సాహం తో తమకి నచ్చినట్టు వ్యవహరించారు.

రాజ్యాంగం ప్రభుత్వానికి ఎంత అధికారం ఇచ్చిందో వాటిని సరిచూసే అధికారం కోర్టులకి అంతే ఇచ్చింది! న్యాయవ్యవస్థ పని ప్రజాప్రతినిధులు అడ్డదారుల్లో వెళ్లకుండా చూడడం. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి - ఒకటి చర్చలు అన్ని స్థాయిల్లో జరిగి ఉంటే చాలా సమస్యలు (తెలుగు మాధ్యమం రద్దు,అమరావతి) లాంటి సమస్యలు తలెత్తేవి కాదు.



తెలుగు మీడియం రద్దు


ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసి కేవలం ఒక భాగంగా మాత్రమే ఉంచాలి అనేది ప్రభుత్వ లక్ష్యం.

కానీ ఇక్కడ ప్రభుత్వం తీసుకునే ఏకపక్ష నిర్ణయాలకి బలయ్యేది విద్యార్థులు. అసలు ఏ మాద్యమం లో చదవాలి అనేది ఐఛ్చికం అవ్వాలే కానీ ప్రభుత్వం ఒకటే మాధ్యమం పెట్టడానికి అర్హత లేదు అని కోర్టు వ్యాఖ్యానించింది.

కానీ ప్రభుత్వం సుప్రీం గడప తొక్కాలి అని భావించింది,అందులో తప్పు లేదు. ఇక్కడ హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ లో "96% మంది పిల్లల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపుతున్నారు" అని ఒక నివేదిక జత చేసింది. ఇక్కడ అసలు అంశం ఏంటంటే హైకోర్టు చేప్పింది ఎంచుకునే అధికారం తల్లిదండ్రులది అని, అంటే ఆంగ్లం,తెలుగు రెండు మాధ్యమాలు ఉంచాలి అని. కానీ ప్రభుత్వం అసలు చేసారో చేయలేదో తెలియని సర్వే రిపోర్టులు కోర్టులో పెట్టారు! ప్రభుత్వ తీరుని వ్యతిరేకించిన వాళ్లని, అసలు నాణ్యత గురించి ఇతరత్రా అంశాల గురించి ప్రశ్నలు లేవనెత్తిన వారికి జవాబుగా "పేదలని ఎదగనివ్వాలనుకోవడం లేదా" అనే విమర్శ ఒక్కటే వచ్చింది. అందరూ కోరింది తెలుగు తో పాటుగా ఆంగ్లం మాధ్యమం గా ప్రవేశపెట్టమని.

నిజనాకి మనం చర్చించాల్సిన అంశం "నాణ్యత". తెలుగు మాధ్యమం లో భోధించే అధ్యాపకులు ఆంగ్లం లో భోధించాలి అంటే ఎంత సమయం పడుతుంది?అసలు తెలుగు మాధ్యమం లో నాణ్యత ఎంత ఉంది? ఎంత మంది విద్యార్థులకి ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు?అసలు పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన ఎలా ఉంది? తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి రాగానే పిల్లల్లో ఏం మార్పు వస్తుంది? ఇలాంటి సమస్యలని గాలికొదిలేసి కేవళం మాధ్యమం మార్పు చుట్టూ తిరుగుతుంది ప్రభుత్వం. ఇక్కడ తన మాట నెగ్గాలి అన్నదే తప్ప అసలు చేసేది ఎంత వరకు సబబు అనేది పెద్దలు ఆలోచించలేదు!

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు దానికి అసలు కారణాలు.


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న రమేష్ కుమార్ కరోనా నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలని వాయిదా వేసారు. అది వైసిపి ప్రభుత్వానికి రుచించలేదు,దానికి కారణాలు కూడా తర్వాత విశ్లేషిద్దాం. దానికి ప్రభుత్వం తీసుకున్న వైఖరి చర్చనీయాంశం అయింది. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి "చంద్రబాబు తన కులం అని చూసి ఎన్నికల కమీషనర్ గా అపాయింట్ చేసారు" అని వ్యాఖ్యానించారు. కేవళం ఎన్నికలు వాయిదా వేసినందుకు ఒక అధికారికి కులం అంటగట్టారు. ఇదంతా కుట్ర అని కూడా అన్నారు. అంతటితో ఆగకుండా ఒక ఆర్డినెన్సు తెచ్చి "పదవీకాలాన్ని" తగ్గించి రమేష్ కుమార్ ని తొలగించారు. ఇదంతా ఒక లెక్క. ఎన్నికలు వాయిదాకే ఇంత జరిగింది అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలియాలి. స్థానిక ఎన్నికల్లో దాదాపుగా 60-70% వరకు అధికార పార్టీ అభ్యర్థులవి ఏకగ్రీవం అయ్యాయి. చాలా చోట్ల ప్రతిపక్షాలు నామినేషన్లు వేసినా భయపెట్టి,బెదిరించి, ఏదోలా నామినేషన్లు విత్డ్రా చేయించి మరీ "ఏకగ్రీవం" అయ్యారు. ఏకగ్రీవం అయినా చాలా చోట్ల ఇలాగే జరిగింది. ఇలా జరిగింది కాబట్టే ఎన్నికలు వాయిదా విషయం లో అంత వరకూ వెళ్లాల్సి వచ్చింది ప్రభుత్వం. చేసిన పనులని సమర్థించుకోవడానికి కమీషనర్ నే తీసేసింది. తమ కోరికలకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు రాజ్యాంగ వ్యవస్థనే నిర్వీర్యం చేసే స్థాయికి వెళ్లారు!

ఇక్కడ కూడా కోర్టు తన పని తాను చేసింది. ఎన్నికల విషయం లో బెదిరింపులు ,దౌర్జన్యాలు చేసి ప్రజాస్వామిక వ్యవస్థని , వాటిని సమర్థించుకోవడానికి రాజ్యాంగ వ్యవస్థలని నిర్వీర్యం చేసారు..సంక్షేమం వళ్ల వచ్చే లాభం కంటే వీటి వళ్ల వచ్చే నష్టం ఎక్కువ.

మీడియా -సోషల్ మీడియా మీద ఆంక్షలు


మీడియాలో సహజంగా అనుకూల వ్యతిరేక మీడియాలు ఉంటాయ్! విమర్శలు సహజం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని (అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే తప్పుడు వార్తలు రాయడమే వారి ద్రుష్టిలో) కొన్ని చానళ్ల ప్రసారాలు ఆపేసారు! కానీ వారికి అనుకూలమైన చానల్ మాత్రం విషం చిమ్ముతూనే ఉంది. నిరాధార వార్తలు రాస్తున్నారని ఆపేయడం సరే కాకపోతే అదే సూత్రం అందరికీ వర్తింపజేయాలి! కానీ ఐది జరగడం లేదు.

సోషల్ మీడియాలో పరిస్థితి అంతే ,తమ వారు రాస్తే ఒరకంగా,ఎదుటి వారు రాస్తే ఇంకోరకంగా పరిగణలోకి తీసుకుని విమర్శించే వాళ్ల నోళ్లు మూయించడానికే తప్ప మరో ఉద్దేశం లేదు. నిరాధార వార్తలు/వ్యాఖ్యానాలు చేయడం వేరు విమర్శ వేరు - రెండిటిని ఒకటే అని చూపి విమర్శకు నోళ్లు మూయిద్దాం అనుకుంటే అది పెద్దపొరపాటు! ఏ ప్రభుత్వమైన విమర్శలని పరిశీలించి లోటు పాట్లు సరిదిద్దుకుంటుంది, కాని ఇక్కడ అలా కాదు! ప్రతిపక్షంలో ఒకలా అధికారం లో కలా ప్రవర్తించడం పరిపాటిగా మారిపోయింది.



ఇక బిల్డ్ ఏపి - ఆస్తుల అమ్మకం

భూముల వేలం - అసలు భూములు అమ్మాల్సిన అవసరం ఏంటి?

ఆర్థికంగా చితికిపోయింది అనుకుందాం! అలాంటప్పుడు అనవసర ఖర్చులు దేనికి! సంవత్సరం అయిన సంధర్భంగా అన్ని వార్తా పత్రికల్లో మొదటి పేజ్ ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇష్టమొచ్చినట్టు దుబారా ఖర్చులు దేనికి ? ప్రభుత్వానికి చిత్తశుద్దే ఉంటే ఆదాయాన్ని పెంచే మార్గాలని, అనవసర వ్యయం తగ్గించే మార్గాలని వెతుకుతుంది అంతే కానీ భూములు అమ్మడం వళ్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ! ప్రభుత్వ భూములు భవిష్యత్ లో పరిశ్రమల కోసమో,ఇతరత్రా మౌలికవసతుల కోసమో ఉపయౌగించవచ్చు, ఇప్పుడు అమ్మేయడం వళ్ల ఒనగూరే ప్రయోజనం శూన్యం! దీని బట్టి ఏం గ్రహించలి అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర వ్యయ ఆదాయాల మీద ముఖ్యమంత్రికి అవగాహన తక్కువ అని! చెప్పిన వాగ్ధానాలకి ఎంత మొత్తం అవసరం అవుతుంది అనేది వాగ్ధానం చేసినప్పుడు తెలియాలి!లేకపోతే ఇలా అమలు కోసం భూములు అమ్మాల్సిన దుస్థితి దాపరిస్తుంది.

ఇక అస్మదీయులు - కాంట్రాక్ట్లు - పదవులు గురించి

సహజంగా ఏ పార్టీ అయినా తన వారికి ప్రాధాన్యత ఇస్తుంది అది తెదేపా చేసింది ఇప్పుడు వైకాపా కూడా చేస్తుంది. అప్పటి ప్రతిపక్షంగా ఉన్న వైసిపి "తన వర్గం వాళ్లని మాత్రమే అధికారులుగా నియమిస్తున్నాడు" అని విమర్శించిన వైసిపి ,ఎన్నికల కమీషనర్ కూడా ఒక కులం వాడు అని చెప్పిన వైసిపి తాను మాత్రం అదే సూత్రాన్ని పాటిస్తుంది.

తన వారికి రివర్స్ టెండర్ అని చెప్పి పోలవరం నుంచి వెలిగొండ వరకు మేజర్ కాంట్రాక్ట్ లు అప్పజెప్పారు, ఆ కంపెనీ వారికి ఎంత వైకాపా ఎంత ఆప్తులో విదితమే! ఇంక ప్రభుత్వ పదవులు,సలహాదార్ల విషయానికి వద్దాం!! రాష్ట్రం లో ఏ కులం లేనట్టు ఒకే కులానికి చెందిన వారిని సలహాదారులుగా నియమించడం , పైగా సమ న్యాయం అంటూ పైకి బీరాలు పలకడం. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఒకలా తర్వాత ఇంకోలా ఇది పరిపాటిగా మారింది.

అభివ్రృధ్ధి వికేంద్రీకరణ - అధికార వికేంద్రీకరణ

రాజధాని అంటే పరిపాలన వ్యవస్థ,మంత్రులు,ఉద్యోగులు,ముఖ్యమంత్రి ఒకే చోట ఉంటాయి! పాలనా పరమైన వికేంద్రీకరణ వళ్ల సమస్యలే తప్ప ఒరిగేది లేదు!

ముఖ్యమంత్రి ఒక చోట ఉండి, ఇంకో చోట ఎమ్మెల్యేలు ఉండటం వళ్ల అసలు అధికారులు - మంత్రులు - ప్రజల మధ్య సమన్వయం లోపిస్తుంది! అధికార వికేంద్రీకరణే అభివ్రృధ్ధి వికేంద్రీకరణ అని చెప్పడం ద్వారా వాళ్లు సాధించేది శూన్యం! హైకోర్టు కర్నూలు పెట్టినంతమాత్రాన అభివ్రృధ్ధి జరగదు! పరిపాలనా రాజధాని విశాఖ లో పెట్టినంతమాత్రాన శ్రీకాకుళం అభివ్రృధ్ధి చెందదు. ఇప్పుడు విశాఖ లో సచివాలయం పెట్టినంత మాత్రాన ఆ ప్రాంతం ఇప్పటికే పట్టనీకరణ వళ్ల ఎంతో కొంత లబ్ధి పొందిన మాట వాస్తవం, ఇప్పుడు ఇది పెట్టినంతమాత్రాన విశాఖ మన్యంలోని సమస్యలు పోతాయా అంటే అదీ లేదు! పరిపాలన విభజన వళ్ల ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరే అవకాశమే లేదని స్పష్టం.పరిపాలనా రాజధాని వళ్ల ఉత్తరాంధ్ర మొత్తం అభివ్రుధ్ధి చెందుతుందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు ఉండదు కూడా! ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలు ఇది ప్రకటించగానే "మా ప్రాంతానికి వస్తుంది అన్న ఆలోచనతో" దాన్ని సమర్థిస్తారు, ఈ క్రమంలో నష్టపోయన వారు ఆ ప్రాంతాన్ని విమర్శించడం దానికి వాళ్ల ప్రతివిమర్శ దీని వళ్ల ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలు పెరుగుతాయే తప్ప ఒరిగేది ఏమీ లేదు!

అమరావతి - ప్రపంచస్థాయి రాజధాని గా తీర్చిదిద్దాలనుకోవడం తప్పలేదు!అంతమాత్రాన" అభివ్రుధ్ధి కేంద్రీకరించి" మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయడం పధ్ధతి కాదు! ఇక్కడ అవసరమైన మేర కట్టడాలు నిర్మించి ఆ తర్వాత ఆర్థికాభివ్రుధ్ధి జరిగాక ఎలా కావాలన్నా చేసుకోవచ్చు!

దీనికి 30వేల మంది రైతులు ప్రభుత్వం మీద నమ్మకంతో రాష్ట్ర అభివ్రుధ్ధి కోసం 33వేల ఎకరాలు "పూలింగ్"ద్వారా ఇచ్చారు! ఇప్పుడు కేవళం రెండు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాలు కోసం అంత అనవసరం! రైతులకి తిరిగి భూములిచ్చే విధానం,దాని విధివిధానాలు ఎలా ఉంటాయో తెలీదు! సగం పనులు అయిన చోట్ల పరిస్థితి ఏంటి? పెట్టుబడులు పెట్టిన చోట కనీస అవసరాలు లేనప్పుడు ఏ సంస్థ నష్టాలని కొనితెచ్చుకోదు!అలాంటి సంస్థలు నష్టపోవడమే కాదు దాని వళ్ల వచ్చే పెట్టుబడులు రావు! దీని వళ్ల అసలుకే మోసం! అభివ్రృధ్ధి ప్రాంతాల వారీగా జరగాలి! శ్రీకాకుళానికి తగ్గ అభివ్రృధ్ధి అక్కడ.జరగాలి ,ప్రకాశం జిల్లాకి సంభందించి అక్కడ జరగాలి! ఇలా వికేంద్రీకరణ అభివ్రృధ్ధి లో ఉండాలి కానీ పరిపాలనలో కాదు.

సంక్షేమం -పేదరికం - అభివ్రృద్ధి

సంక్షేమ పధకాల సువర్ణయుగం అంటూ,పధకాల చుట్టూనే అభివ్రృద్ధి కేంద్రీక్రృతమై ఉంటుంది అని చెప్తూ ప్రజలని మభ్యపెడుతున్నారు రాజకీయ నాయకులు. ప్రవేశపెడుతున్న పధకాలకి అసలు సమస్యలకి పొంతన ఉన్నా అసలు పధకాల లక్ష్యం ఎంత వరకూ చేరుకుంటున్నాయి అన్నది అసలు ప్రశ్న. లబ్ధిదారుల ఎంపిక ఒక లెక్కైతే ,వాళ్లకి లబ్ధి అందేలా చూడడం ఇంకో లెక్క. అసలు లబ్ధిదారులు ఎవరు అనేది అసలు సమస్య. ఆర్థిక అభివ్రుధ్ధి అంటే - పౌరులు(ప్రజలు) తలసరి ఆదాయం పెరగడం - ఆదాయం పెరిగితే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి - జీవన ప్రమాణాలు మెరుగు పడితే ఆరోగ్యం,విద్య,పౌష్టికాహారం లాంటి కనీస అవసరాలు మరింత నాణ్యమైన రీతిలో అందుబాటులోకి వస్తాయి! అంటే ఆదాయం పెరిగితే నాణ్యమైన ఆహారం లభిస్తుంది. మిగిలిన వన్నీ ఆధారపడి ఉంటాయి!ఏ పధకం అయినా జీవన ప్రమాణాలని మెరుగుపరిచడానికే! ఆ ప్రమాణాలు పెరగాలంటే కావాల్సింది ముందు మౌలికసదుపాయాలు కల్పన జరగాలి! అవి ప్రభుత్వం చేతిలో ఉంటాయి! HUMAN DEVELOPEMENT INDEX ముఖ్యంగా తీసుకునేవి Life Expectency, Healthy life ,Education.ఇవి లేకుండా మానవాభివ్రుధ్ధి పెరగదు!ఈ సూచి ఆధారంగా దేశం ఎంత అభివ్రుధ్ధి చెందుతుంది అనేది తెలుస్తుంది!

ప్రజలకి ఇవి కల్పించే భాధ్యత ప్రభుత్వానిది! ఇప్పుడు ఇస్తున్న పధకాలు ఎంత వరకూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయ్ అనేది ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఒక పథకం పెట్టడం వరకే ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది లబ్ధిదారులకి చెరడం ఎలా, అసలు లబ్ధి ఎంత ఏ విధంగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయ్,అసలు ఆ సొమ్ము/లబ్ధి ఎటు పోతుంది అన్నది కూలంకుషంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అమ్మ ఒడి పధకం మంచిదే కాకపోతే ఆ పధకం ద్వారా అసలు లబ్ధి ఎంత అన్నది ప్రభుత్వాలు ఎనాడైనా ఆలోచించాయా? ఆ 15000 అసలు పిల్లల చదువు కోసమే ఖర్చు పెడుతున్నారా లేక వేరేదానికా? వీటి మీద ప్రభుత్వాలు ద్రృష్టి పెట్టాలి. అమలు చేసి చేతులు దులుపుకుంటే మాత్రం ఆకలికి అర్రులు చాచే చేతులు ఇంకో 50ఏళ్లైనా తగ్గవు! ఒక పధకం దాని లక్ష్యాలని నెరవేరకపోతే అది ప్రజాధనం వ్రృధా అవ్వడమే. పిల్లలు బడిలో ఎక్కువ చేరినంత మాత్రాన పధకం లక్ష్యం చేరుకున్నట్టు కాదు, ఆ చేరిన వాళ్లు ఎంత నేర్చుకుంటున్నారు, ఎంత కాలం చదువుతున్నారు, నేర్చుకునే విద్య నాణ్యత ఎంత అనేది కూడా ద్రృష్టిసారించాలి. ఇలాగే ఏ పధకం అయినా సరే వాహన మిత్ర అని 10,000 ఇచ్చి RTA ద్వారా రెట్టింపు ఫైన్లు వేసి తీసుకోడం ఎంతవరకు సబబు? రైతు భరోసా కూడా అసలు అర్హులు ఎంత మంది!.కౌలు రైతులు ఎంతమంది అసలు కౌలు రైతులకు లబ్ధి వెళ్తుందా అన్నది ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రకటించిన సంక్షేమ పధకాల వళ్ల లబ్ధి ఎంతో అసలు లబ్ధి అనేది ఉందో లేదో ప్రభుత్వమే తేల్చాలి!

నామమాత్రాన జనాలకి డబ్బులిచ్చి ఇదే అభివ్రృధ్ధి అని చేతులు దులుపుకుంటే అసలు అభివ్రృధ్ధి అనేది రానేరాదు. అభివ్రృధ్ధి అన్ని దశల్లో జరగాలి. పేదవాడు ఇన్ని ఇచ్చినా ఇంకా పేదరికం నుంచి ఎందుకు బయటపడటం లేదు అనే విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. సంక్షేమం వళ్ల లాభం ఉంది కానీ సంక్షేమమే అభివ్రృధ్ధి అనే మూస నుంచి నాయకులు బయటకి రావాలి.




మొత్తంగా ఇసుక దగ్గర నుండి ఎన్నికల కమీషనర్ తొలగింపు వరకు!

హైకోర్టు తరలింపు దగ్గర నుండి తెలుగు మాధ్యమం రద్దు వరకు.

అమరావతి రద్దు నుంచి రంగుల వరకూ ఇలా ప్రతి విషయాన్ని సమస్యాత్మకంగా మార్చుకుంటూ, సంక్షేమమే అభివ్రృధ్ధి అనే భ్రమలో ప్రజలని ముంచుతున్న ప్రభుత్వం మేలుకోవాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి. అప్పుడే సుస్థిర అభివ్రృధ్ధి సాధ్యం.

1,011 views2 comments

2 Comments


vsmetpaly
Jun 01, 2020

అన్నీ చక్కగా ఉదహరించారు !! ప్రభుత్వ పనితీరు వాటి ప్రభావాలు వెల్లడించారు 👍👌

Like

rajasreekanth19
May 31, 2020

చాలా బాగుంది. క్లుప్తంగా సూటిగా బాగా వ్రాసారు. ప్రభుత్వ వొంటెద్దుపోకడలు బాగా యెండగట్టారు. ఇక్కడ భావమేకానీ భాష ముఖ్యంకాదు కానీ కొంచెం ప్రూఫ్ రీడింగ్ చేయండి.

Like
bottom of page