కాగితం మీద బాగానే వుంది, అమలు సాధ్యమేనా...!!!
2019-20 కు గాను ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ఆర్ధిక మంత్రి వర్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్ గారు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
మొత్తం అన్ని రంగాల్లో కలుపుకొని 2,27 లక్షల కోట్ల బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు ప్రవేశపెట్టారు.
ఎక్కువ మొత్తంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు జరపడం ఇదే తొలిసారి.
ఐతే మంత్రిగారు చెప్పిన లబ్ధిదారుల సంఖ్య మాత్రం అనుకున్నదానికన్న తక్కువ ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం.
క్రిందటి ప్రభుత్వం కేవలం కాగితం లెక్కలు చూపించి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఎలా వ్యవహరించిదో, అదే ధోరణిలో ప్రస్తుత ప్రభుత్వం అదే మార్గం అనుసరించడం సరికాదు అనేది విశ్లేషకుల భావన.
"మాట తప్పం, మడమ తిప్పం" అనే విధంగా మా ప్రభుత్వ పనితీరు ఉంటుంది అని ముఖ్యమంత్రి జగన్ గారు సెలవిచ్చినా అది కేవలం మాటల వరకే అన్న విషయం విదితం అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదేమో అనిపిస్తుంది.
గత సంవత్సరం కేంద్రం నుండి విడుదల అయ్యిన మొత్తం 19వేల కోట్లు కాగా ఈ సంవత్సరం అది 62 వేల కోట్లకు ఎలా పెరుగుతుందో మన గౌరవ ఆర్ధిక మంత్రి వర్యులు సెలవు ఇస్తే బాగుండేది.అంతే కాకుండా పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానా కు వచ్చే ఆదాయం గత ఏడాది తో పోలిస్తే ఈసారి 30% పెరుగుదల ఉంటుంది అని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. కానీ అది ఎలా అనే ప్రశ్న మాత్రం సామాన్యుడి మెదడు లో మెదులుతూనే ఉంది.
వెనుకబడిన తరగతులకు మరియు షెడ్యూల్డ్ కులాల వారికి బడ్జెట్ మిశ్రమ ఆనందాన్ని మాత్రమే ఇవ్వగలింది.
139 వర్గాల వారికి వేరు వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం లాంటివి తప్పితే మిగతా వాటి గురించి జగన్ ప్రభుత్వం మర్చిపోయినట్టే అనిపిస్తుంది.
గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తో పాటు గిరిజన ప్రజల ఆర్యోగ పరిస్థితుల గురించి కూడా మంత్రి గారు కాస్త ప్రస్తావించి ఉంటే మరింత బాగుండేది.
రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ లో ఒక వంతు కూడా కేటాయించకపోవడం మరింత హాస్యాస్పదం.ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక తో రాజధాని నిర్మాణం జరగాలి అని ముఖ్యమంత్రి గారు సెలవిచ్చినా దానిని కార్యరూపం దాల్చడానికి తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి. అసలు మన ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి ఓ కాదో అనే మీమాంస లో ప్రస్తుత ఆంధ్ర ప్రజలు ఉన్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు
"అమ్మఒడి" పధకం క్రింద పిల్లలను బడి కి పంపించే ప్రతి తల్లి కి 20 వేల రూపాయలు క్రింద అందజేస్తాం అని మేనిఫెస్టో లో చెప్పిన విధంగానే దానిని బడ్జెట్ లో ప్రవేశ పెట్టారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యా ప్రమాణాల గురించి గాని, అక్కడ ఉన్న సమస్యల గురించి గాని ఆర్ధిక మంత్రి గారు కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం.
ఉద్యోగాల క్రింద కేవలం "గ్రామ వాలంటీర్లు" అనే ఒకే ఒక్క అంశం తప్ప వేరే వైపు నుండి నిరుద్యోగ సమస్య ను పారద్రోలే విధంగా బడ్జెట్ లో ఏం లేదని ఆర్ధిక మంత్రి చెప్పిన లెక్కలు బట్టే అర్ధం అవుతుంది.ఇప్పటికే గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలలో వైసీపీ నాయకులు తమ చేతివాటాన్ని చూపిస్తున్నారని నీలి మబ్బులు కమ్ముకున్నాయి.అంతే కాకుండా నిరుద్యోగులకు వారి వారి కోర్సులలో శిక్షణా కార్యక్రమాన్ని అప్పట్లో గత ప్రభుత్వం ప్రారంభించింది కానీ దానికి కొనసాగింపుగా కొత్త ప్రభుత్వం చర్యలు ఏం తీసుకోబోదని బడ్జెట్ గణాంకాలు చెప్తున్నాయి.ఇది రానున్న సంవత్సరాల లో నిరుద్యోగుల పైన తీవ్ర ప్రభావం చూపంచబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నాణెంలో మరో వైపు చూసుకుంటే రైతులకు ఒక విధంగా మంచి ప్రణాళిక రూపొందించారు అనే అనిపిస్తుంది.అయినా అమలు లో ఎంత గోప్యం చూపిస్తారో అనే ప్రశ్న యధావిధిగా అందరి మనసుల్లో ఉంది.అంతే కాకుండా మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలు అన్ని మొదటి బడ్జెట్ లోనే పెట్టడం గమనించాల్సిన విషయం.
2021 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి మరియు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం లాంటివి కూడా పూర్తిగా చేస్తాం అని హామీల వర్షం కురిపించారు..!! కానీ వాటి సాధ్యాసాధ్యాలు గురించి మాత్రం ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ప్రజలకు ఒక ఖచ్చితత్వం ఇవ్వడంలో మాత్రం అధికార పక్షం విఫలం అయింది అనే చెప్పాలి.
ఆటగాళ్లు మారారు.
కానీ ఆట మారుతుందా.?
లేదా అదే పంథాలో కొనసాగిస్తారా అనేదే పెద్ద ప్రశ్న.
This will do a lot of damage to the AP economy as most of the budget is allocated to welfare and temporary solutions.